Gaddar: ప్రజాశాంతి పార్టీలో చేరి షాకిచ్చిన గద్దర్
- మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిగా బరిలోకి
- రేపటి నుంచి మునుగోడులో ఇంటింటి ప్రచారం
- ఆమరణ దీక్షను విరమించిన కేఏ పాల్
ప్రజా గాయకుడు గద్దర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రజా యుద్ధ నౌకగా తెలంగాణలో ఎంతో పేరు తెచ్చుకున్న గద్దర్.. కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. కేఏ పాల్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న గద్దర్ వచ్చే నెలలో జరిగే మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజా శాంతి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. గురువారం నుంచి మునుగోడులో ఇంటింటి ప్రచారం చేస్తానని గద్దర్ తెలిపారు. మరోవైపు ఈ నెల 2న పీస్ మీటింగ్ కు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ చేస్తున్న ఆమరణ దీక్షను కేఏ పాల్ విరమించారు. ఆయనకు గద్దర్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
కాగా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే గద్దర్ తన పాటలతో తెలంగాణ సమాజాన్ని ఎంతో చైతన్య పరిచారు. తెలంగాణ ఉద్యమంలో సైతం ఆయన పాటలు ఎంతో మందిలో స్ఫూర్తిని రగిలించాయి. అయితే, ఆ మధ్య ఆయన ఆలోచనా విధానంలో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ ఓటు హక్కు వినియోగించుకోని గద్దర్ ఈ మధ్య ఓటు వేశారు. అలాగే, హైదరాబాద్ లో జరిగిన నరేంద్ర మోదీ బహిరంగ సభకు హాజరై అందరినీ ఆశ్చర్య పరిచారు. అలాగే, గాంధీ భవన్ కు కూడా వెళ్లారు.