Uddhav Thackeray: ఉద్ధవ్ థాకరేకు మరో షాక్... షిండేకు పూర్తి మద్దతు పలికిన సోదరుడు జయదేవ్ థాకరే

Uddhav Thackeray brother Jaideb Thackeray announces support to Eknath Shinde
  • షిండే వేస్తున్న అడుగులు తనకు నచ్చాయన్న జయదేవ్ థాకరే
  • పేదలు, రైతుల కోసం షిండే పని చేస్తున్నారని కితాబు
  • షిండే మళ్లీ అధికారాన్ని చేపట్టాలని ఆకాంక్షించిన థాకరే
మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేకు మరో షాక్ తగిలింది. శివసేన తిరుగుబాటు నేత, ప్రస్తుత సీఎం ఏక్ నాథ్ షిండేకు థాకరే సోదరుడు జయదేవ్ థాకరే పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మీరు షిండే వర్గంలో ఉన్నారా? అని గత ఐదారు రోజులుగా అడుగుతున్నారని... థాకరేలు ఏ వర్గంలోనూ ఉండరని చెప్పారు. షిండే వేస్తున్న అడుగులు తనకు నచ్చాయని... అందుకే తాను షిండే వద్దకు వచ్చానని ఆయన అన్నారు. 

ఏక్ నాథ్ షిండేను ఒంటరిగా వదిలేయకూడదని... అందరూ ఆయనకు మద్దతుగా నిలవాలని జయదేవ్ థాకరే చెప్పారు. పేదలు, రైతుల కోసం షిండే పని చేస్తున్నారని కితాబిచ్చారు. తమ రైతుల మాదిరే షిండే కూడా చాలా కష్టపడి పని చేస్తారని చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ షిండే ప్రభుత్వమే రావాలనేది తన ఆకాంక్ష అని అన్నారు. ఎన్నికలు రావాలని, మళ్లీ షిండే అధికారాన్ని చేపట్టాలని కోరుకుంటున్నానని చెప్పారు. తన పూర్తి మద్దతు షిండేకే అని తెలిపారు.
Uddhav Thackeray
Brother
Jaidev Thackeray
Eknath Shinde
Shiv Sena

More Telugu News