Wipro: ఈ నెల 10 నుంచి విప్రోలో హైబ్రిడ్ విధానం... అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఐటీ ఉద్యోగులు
- వారంలో 3 రోజుల పాటు ఆఫీస్‌కు రావాలన్న విప్రో
- సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో 3 రోజుల పాటు ఆఫీస్‌కు రావాలని ఆదేశం
- ఉద్యోగుల మధ్య స్నేహపూర్వక వాతావరణానికే ఈ చర్యలంటూ మెయిల్
మూన్ లైటింగ్ పద్దతిని ఆశ్రయించి రెండేసి ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులపై ఇప్పటికే వేటు వేసిన భారత ఐటీ దిగ్గజం విప్రో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థ ఉద్యోగులకు హైబ్రిడ్ పని విధానాన్ని అమలు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ నెల 10 నుంచి హైబ్రిడ్ పని విధానాన్ని అమలు చేయనున్నట్లు ఉద్యోగులకు మెయిల్ ద్వారా తెలియజేసింది. ఈ నిర్ణయంపై విప్రో ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
హైబ్రిడ్ పని విధానం ప్రకారం ఉద్యోగులు వారానికి 3 రోజుల పాటు ఆఫీసుకు వచ్చి పనిచేయాల్సి ఉంటుంది. ఈ విధానంలో తమ ఉద్యోగులంతా ప్రతి సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో కనీసం 3 రోజుల పాటు ఆఫీసుకు వచ్చి పనిచేయాలని విప్రో తెలిపింది. ఉద్యోగుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పే దిశగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది.