G Jagadish Reddy: వేల కోట్లతో చేపట్టిన ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తీర్పును ఇవ్వడం దారుణం: జగదీశ్ రెడ్డి
- యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఆపాలంటూ గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పు
- ఏదో కుట్ర జరుగుతోందన్న జగదీశ్ రెడ్డి
- తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని వ్యాఖ్య
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఆపాలంటూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును ఆపేందుకు ఏదో కుట్ర జరుగుతోందనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. అన్ని పర్యావరణ అనుమతులు తీసుకున్న తర్వాతే ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టామని... వేల కోట్ల ఖర్చుతో నిర్మాణాన్ని చేపట్టిన తర్వాత ప్లాంట్ కు వ్యతిరేకంగా తీర్పును ఇవ్వడం దారుణమని అన్నారు.
ట్రైబ్యునల్ తీర్పు ఏకపక్షంగా ఉందని... దీనివల్ల యావత్ దేశానికి కూడా నష్టమని చెప్పారు. అన్ని చట్టాలకు లోబడే ప్లాంట్ నిర్మాణం జరుగుతోందని చెప్పారు. ట్రైబ్యునల్ తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని తెలిపారు. అనుకున్న సమయానికి ప్లాంటును పూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభిస్తామని తెలిపారు.