2023 World Cup: ప్రపంచకప్ కు క్వాలిఫై కావడం కష్టమే..అయినా ప్రయత్నిస్తాం: హెన్ రిచ్
- ఆస్ట్రేలియాతో సిరీస్ రద్దు చేసుకోవడంతో క్లిష్ట పరిస్థితి
- 13 జట్ల వరల్డ్ కప్ సూపర్ లీగ్ లో 11వ స్థానం
- తమ నియంత్రణలో లేని వాటిపై ఆందోళన చెందడం లేదని వ్యాఖ్య
ప్రపంచకప్ 2023కు అర్హత సాధించడం దక్షిణాఫ్రికా జట్టుకు అతిపెద్ద లక్ష్యంగా మారింది. 13 జట్ల ప్రపంచ కప్ సూపర్ లీగ్ లో దక్షిణాఫ్రికా 11వ స్థానంలో ఉంది. భారత్ తో వన్డే సిరీస్ కు ముందు 13 మ్యాచుల్లో దక్షిణాఫ్రికా గెలిచింది నాలుగు మాత్రమే. వచ్చే జనవరిలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ను దక్షిణాఫ్రికా రద్దు చేసుకోవడంతో 30 ఓడీఐ వరల్డ్ కప్ సూపర్ లీగ్ పాయింట్లను వదులుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెటర్ హెన్ రిచ్ క్లాసెన్ స్పందించాడు.
‘‘వచ్చే ఏడాది ప్రపంచ కప్ కు అర్హత సాధించడం నిజంగా కష్టమైనది. కానీ, మేము కచ్చితంగా ప్రయత్నం చేస్తాం. కొన్ని రోజుల్లో మొదలు కానున్న టీ20 ప్రపంచకప్ పైనే ప్రస్తుతం మా దృష్టంతా ఉంది. మా నియంత్రణల్లో లేని ఇతర అంశాల గురించి మేము ఆందోళన చెందడం లేదు. దక్షిణాఫ్రికా జెర్సీతో మైదానంలోకి అడుగు పెట్టిన ప్రతిసారీ విజయం సాధించాలనే కోరుకుంటాం’’అని క్లాసెన్ చెప్పాడు.