Chandrababu: ప్రజలను బాదేస్తున్న పన్నులు.. లక్షల కోట్ల అప్పులు ఏమవుతున్నాయి?: చంద్రబాబు
- గుంతల రోడ్డులో పడి చిన్నారి మృతి చెందిందన్న చంద్రబాబు
- వారం రోజులు గడిచినా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ పడలేదని ట్వీట్
- అన్నిటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్
వైసీపీ పాలనలో రాష్ట్ర పరిస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మన రాష్ట్ర పరిస్థితి ఇలా ఉందంటూ ఆయన పలు అంశాలను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. ప్రభుత్వ కాంట్రాక్ట్ బిల్లులు మంజూరు కాక... క్యాన్సర్ బాధితుడైన తండ్రి వైద్యానికి డబ్బులు లేక లేపాక్షి మండలం వెంకటశివప్ప బాధపడుతున్నారని తెలిపారు. కాకినాడ జిల్లా జె.తిమ్మాపురంలో ఆసుపత్రికి వెళ్తున్న పసిబిడ్డ గుంతల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ఆదాయం గాడిన పడిందని సీఎం చెప్పారని... కానీ, వారం రోజులు అయినా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ పడలేదని అన్నారు. రాష్ట్ర పాలనా దుస్థితికి ఇవన్నీ ఉదాహరణలని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలు సామాన్యుడి జీవితాలను ఎలా ఛిద్రం చేస్తున్నాయో చెప్పడానికి ఇవి నిదర్శనమని అన్నారు. ప్రజలను బాదేస్తున్న పన్నులు ఎటు పోతున్నాయి? లక్షల కోట్ల అప్పులు ఏమవుతున్నాయని ప్రశ్నించిన చంద్రబాబు... వీటికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.