China: లక్షన్నర ఫ్లవర్ వాజ్.. రూ. 74 కోట్లకు అమ్ముడుపోయింది.. నోరెళ్లబెట్టిన వేలం నిర్వాహకులు!
- పారిస్ లోని ఒసెనాట్ వేలంశాలలో విక్రయానికి వచ్చిన ఫ్లవర్ వాజ్
- రూ.లక్షన్నర పలుకుతుందనుకుంటే.. రూ.74 కోట్ల దాకా వెళ్లిన వేలం
- అది పురాతన వస్తువుగా భావించి ధర పెట్టారంటున్న నిపుణులు
- తెలిసీ తెలియకుండా ఎవరో ఎలా కొన్నారో అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు
సాధారణంగా మనం సినిమాల్లో చూస్తుంటాం. ఏవైనా వస్తువుల కోసమో, ఆస్తుల కోసమో వేలం జరుగుతుంటుంది. కొందరు పోటాపోటీగా ధరలు పెంచేస్తుంటారు. ఆ వస్తువులు, ఆస్తుల అసలు విలువ కన్నా చాలా ఎక్కువగా వేలం పాడి సొంతం చేసుకుంటుంటారు. మరి ఇలాంటి ఘటనే ఇటీవల పారిస్ నగరంలో జరిగిన వేలం పాటలో చోటు చేసుకుంది. అరుదైనదిగా భావించిన ఓ ఫ్లవర్ వాజ్ ఏకంగా రూ.74 కోట్లకు అమ్ముడుపోయింది.
అద్భుతమైన కళా నైపుణ్యంతో..
అత్యంత అద్భుతమైన, అందమైన, మన్నికైన పింగాణీ ఉత్పత్తులకు చైనా పెట్టింది పేరు. ఎప్పుడో వందల ఏళ్ల కిందటే చైనాలో పింగాణీ వస్తువులను రూపొందించి, వాటిపై అద్భుతమైన కళా నైపుణ్యంతో చిత్రాలను చిత్రించేవారు. అలాంటి ఓ అరుదైన పింగాణీ ఫ్లవర్ వాజ్ ఇటీవల పారిస్ నగరంలో వేలానికి వచ్చింది. తెలుపు, నీలం రంగులతో చిత్రాలు వేసిన ‘టియాన్‌క్విపింగ్’ వాజ్ ను ఒసెనాట్ వేలం శాల విక్రయానికి పెట్టింది.
కొంత అనుకుంటే.. ఎంతో పలికింది
ఈ ఫ్లవర్ వాజ్ కు 1900 డాలర్ల వరకు పలకవచ్చని వేలం శాల అంచనా వేసుకుంది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.లక్షన్నర అన్నమాట. కానీ వేలం పోటాపోటీగా సాగింది. ఏకంగా 90 లక్షల డాలర్లకు.. అంటే మన కరెన్సీలో సుమారు రూ.74 కోట్లకు అమ్ముడుపోయింది.
నిజానికి ఈ ఫ్లవర్ వాజ్ సుమారు వందా, నూటా ఇరవై ఏళ్ల కిందటిదని నిపుణులు అంచనా వేశారు. కానీ దాని గురించిన వివరాల వెల్లడి లోపంతో దానిని 18వ శతాబ్దానికి చెందినదిగా కొనుగోలు దారులు భావించారు.
- పురాతన వస్తువులకు ఉన్న విలువ మేరకు పోటాపోటీగా వేలం పాడారు. చివరికి చైనాకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా రూ.74 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నాడు.
- ఈ విషయం తెలియడంతో సోషల్ మీడియాలో చిత్రమైన స్పందన వ్యక్తమవుతోంది. ఆ ఫ్లవర్ వాజ్ అసలు వివరాలు చెప్పకుండా వేలం నిర్వాహకులే మోసం చేశారని కొందరు అంటుండగా.. ‘దానికి ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది. అందుకే అంత ధర పెట్టి కొన్నారు.’ అని మరికొందరు పేర్కొంటున్నారు.
- ‘తెలిసీ తెలియకుండా ఎవరు కొన్నారో, ఎలా కొన్నారో..’ అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నవారూ ఎందరో.