YSRCP: కేసీఆర్ బీఆర్ఎస్‌పై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు
- కేసీఆర్ తాత వచ్చినా తమకేమీ నష్టం లేదన్న కారుమూరి
- వైసీపీకి వ్యతిరేక ఓటు అన్నదే లేదని వెల్లడి
- సింహం సింగిల్‌గా వచ్చినట్లు జగన్ సింగిల్‌గానే వస్తారని వ్యాఖ్య
- అన్ని పార్టీలు కలిసి వచ్చినా అత్యధిక మెజారిటీతో గెలుస్తామన్న మంత్రి
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలనే లక్ష్యంతో టీఆర్ఎస్‌ను భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చిన వైనంపై ఏపీలోని అధికార పార్టీకి చెందిన కీలక నేతలు వరుసగా స్పందిస్తున్నారు. తాజాగా శుక్రవారం ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు స్పందించారు. బీఆర్ఎస్ పార్టీతో తమకేమీ నష్టం లేదని ఆయన తేల్చి చెప్పారు. శుక్రవారం మీడియా అడిగిన పలు ప్రశ్నలకు స్పందించిన సందర్భంగా కారుమూరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ కాదు కదా... కేసీఆర్ తాత వచ్చినా వైసీపీకి జరిగే నష్టమేమీ లేదని కారుమూరి అన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను కూడా గుర్తు చేసిన కారుమూరి... వ్యతిరేక ఓటును చీల్చకుండా చూడాలని పవన్ సహా పలువురు నేతలు భావిస్తున్నారని... అయితే తమకు ఉన్నదంతా కలిసివచ్చే ఓటేనని, తమకు వ్యతిరేక ఓటు అన్నదే లేదని తెలిపారు. అందరూ కలిసి వచ్చినా సింహం సింగిల్ గా వచ్చినట్లుగా జగన్ సింగిల్‌గానే వస్తారన్నారు. అన్ని పార్టీలు కలిసి వచ్చినా అత్యధిక మెజారిటీతో వైసీపీ విజయం సాధిస్తుందని ఆయన తెలిపారు.