Indian Prisoners: పాకిస్థాన్ జైళ్లలో మృత్యువాత పడుతున్న భారత ఖైదీలు... కేంద్రం ఆందోళన
- గత 9 నెలల కాలంలో ఆరుగురి మృతి
- తరచుగా భారత మత్స్యకారులను అదుపులోకి తీసుకుంటున్న పాక్
- శిక్షాకాలం పూర్తయినా నిర్బంధంలో ఉంచుతోందన్న పాక్
వివిధ కారణాలతో పెద్ద సంఖ్యలో భారతీయులు పాకిస్థాన్ జైళ్లలో మగ్గుతున్నారు. అయితే, ఇటీవలకాలంలో పాక్ జైళ్లలో భారత ఖైదీల మరణాల సంఖ్య పెరిగింది. ఈ పరిణామాల పట్ల కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
దీనిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి స్పందించారు. భారత ఖైదీల భద్రత పట్ల పాకిస్థాన్ నిబద్ధతతో వ్యవహరించాలని కోరారు. గత 9 నెలల వ్యవధిలో ఆరుగురు భారత ఖైదీలు పాక్ జైళ్లలో మృత్యువాత పడ్డారని, వారిలో ఐదుగురు మత్స్యకారులని బాగ్చి వెల్లడించారు. వారు తమ శిక్షాకాలం పూర్తి చేసుకున్నప్పటికీ, పాకిస్థాన్ అధికారులు వారిని అక్రమంగా నిర్బంధంలో ఉంచారని, ఆ సమయంలోనే వారు చనిపోయారని ఆరోపించారు.
తమ సముద్ర జలాల్లో ప్రవేశించారన్న ఆరోపణలతో భారత మత్స్యకారులను పాకిస్థాన్ బలగాలు తరచుగా అదుపులోకి తీసుకుంటుండడం తెలిసిందే. తాజాగా, మునిగిపోతున్న పడవ నుంచి ఆరుగురు భారత జాలర్లను కాపాడామని పాకిస్థాన్ పేర్కొంది.