USA: ఇండియాకు ప్రయాణ రేటింగ్​ తగ్గించిన అమెరికా.. జాగ్రత్తగా ఉండాలని పౌరులకు సూచనలు!

US Asks Citizens To exercise Increased Caution While Travelling To India
  • అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసిన అమెరికా
  • భారత్ కు చేసే ప్రయాణాలపైనా ఆ దేశ విదేశాంగ శాఖ సూచనలు
  • ముఖ్యంగా జమ్మూకశ్మీర్ ప్రాంతానికి వెళ్లవద్దని హెచ్చరికలు
భారత దేశానికి వెళ్లే తమ పౌరులు మరింత జాగ్రత్తగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ తాజాగా హెచ్చరించింది. నేరాలు, ఉగ్రవాదం నేపథ్యంలో అప్రమత్తతకు సంబంధించిన సూచనలు చేస్తున్నట్టు పేర్కొంది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్ ప్రాంతానికి వెళ్లవద్దని అమెరికా పౌరులకు సూచించింది. ఈ మేరకు శుక్రవారం అమెరికా విదేశాంగ శాఖ ‘అంతర్జాతీయ ప్రయాణ సూచనలు’ను జారీ చేసింది. అందులో భారత్ కు చేసే ప్రయాణాలకు ఇచ్చే రేటింగ్ ను రెండుకు తగ్గించింది. ఇంతకుముందు భారత దేశానికి ప్రయాణ రేటింగ్ ఒకటిగా ఉండేది.

భారత్ కు సంబంధించి చేసిన సూచనలివీ..
‘‘భారత దేశంలో నేరాలు, ఉగ్రవాద ప్రమాదం నేపథ్యంలో అమెరికా పౌరులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జమ్మూకశ్మీర్ ప్రాంతానికి వెళ్లవద్దు. తూర్పు లడఖ్ ప్రాంతానికి మాత్రం అప్రమత్తతతో ఉంటూ వెళ్లవచ్చు. భారత్–పాకిస్థాన్ సరిహద్దులలో సాయుధ దాడుల నేపథ్యంలో.. బార్డర్లకు కనీసం పది కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరంలోనే ఉండాలి..” అని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది.
  • భారత అధికార సంస్థల నివేదికల ప్రకారం ఇండియాలో అత్యాచార నేరాలు చాలా వేగంగా పెరుగుతున్నాయని.. లైంగిక దాడులకు ఎక్కువ అవకాశం ఉంటుందన్న అంశాన్ని గమనంలో ఉంచుకోవాలని సూచించింది.
  • ఎలాంటి హెచ్చరికలు, ముందస్తు సూచనలు లేకుండానే ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉంటుందని.. మార్కెట్లు, షాపింగ్ మాల్స్, ప్రభుత్వ సంస్థల సమీపంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.

ఏమిటీ ప్రయాణ రేటింగ్ లెవల్?
  • తమ దేశ పౌరులు విదేశాలకు ప్రయాణించాలనుకుంటే అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన సూచనలతో అమెరికా విదేశాంగ శాఖ మార్గదర్శకాలను విడుదల చేస్తుంది. దేశాలకు మొత్తం నాలుగు లెవల్స్ గా ఉండే రేటింగ్స్ ను ఇస్తుంది.
  • అందులో లెవల్ జీరో, ఒకటిగా ఉండే దేశాలకు పౌరులు ధైర్యంగా వెళ్లవచ్చని అర్థం. అదే లెవల్ రెండు అయితే జాగ్రత్తగా ఉండాలని సూచన.
  • లెవల్ 3 దేశాలకు వెళ్లేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, వీలైనంత వరకు బయట తిరగొద్దని హెచ్చరిక ఉంటుంది. ఇటీవలే పాకిస్తాన్ కు అమెరికా లెవల్ 3 ప్రయాణ రేటింగ్ ఇచ్చింది.
  • ఇక లెవల్ 4 దేశాలకు అసలు వెళ్లకపోవడమే మంచిదని అమెరికా పేర్కొంటుంది. చాలా వరకు ఉగ్రవాద, యుద్ధ సంక్షుభిత దేశాలు లెవల్ 4లో ఉంటాయి.
USA
India
Travel
International
Offbeat
citizens

More Telugu News