Diwali: దీపావళి నాడు పాక్షిక సూర్యగ్రహణం.. పండుగ ఎప్పుడు చేసుకోవాలన్న దానిపై అయోమయం!
- ఈ నెల 24న అమావాస్య ఘడియలు
- అదే రోజు పండుగ చేసుకోవాలంటున్న జ్యోతిష్య పండితులు
- 25న పండుగ సెలవు ప్రకటించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
- కార్తీక పౌర్ణమిని కూడా ముందు రోజే జరుపుకోవాలని పండితుల సూచన
ఈసారి దీపావళి పండుగనాడు పాక్షిక సూర్యగ్రహణం, కార్తీక పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుండడంతో ఈ పండుగలను ఎప్పుడు జరుపుకోవాలన్న దానిపై ప్రజల్లో అయోమయం నెలకొంది. ఈ నెల 25న సాయంత్రం 5.11 నుంచి 6.27 గంటల వరకు సూర్య గ్రహణం ఏర్పడుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదే రోజున దీపావళి సెలవు ప్రకటించాయి. అయితే, 25న అమావాస్య వెళ్లిపోయి పాడ్యమి వస్తుంది. ఆ రోజు అమావాస్య ఘడియలు ఉండవు కాబట్టి దీపావళి జరుపుకోవడం సబబు కాదని జ్యోతిష్యులు చెబుతున్నారు. 24న ఉదయమంతా చతుర్దశి ఉంటుంది. రాత్రంతా అమావాస్య ఉంటుంది. కాబట్టి 24న లక్ష్మీపూజ చేసుకుని, రాత్రి టపాసులు కాల్చి పండుగ జరుపుకోవచ్చని అంటున్నారు.
కార్తీక పౌర్ణమి విషయంలోనూ ఇలాంటి గందరగోళమే నెలకొంది. నవంబరు 8న మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్ర గ్రహణం ఉంటుంది. సూర్యాస్తమయం తర్వాత కాసేపటి వరకు చంద్ర గ్రహణం ఉంటుంది. అంటే, చంద్రగ్రహణం చివరి నిమిషాల్లో మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో కనిపించే అవకాశం ఉంది. నవంబరు 7 నుంచే పౌర్ణమి ఘడియలు ప్రారంభమవుతాయని, కాబట్టి అదే రోజున కార్తీక వ్రతాలు, పూజలు చేసుకోవచ్చని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.