Kumaraswamy: ప్రాంతీయ భాష‌ల‌ను అణ‌గ‌దొక్కుతున్నారన్న కుమారస్వామి.. మీ నాన్న పీఎంగా ఉన్నప్పుడు కూడా ఇదే జరిగిందన్న బీజేపీ!

Kumaraswamy comments on SSC exams
  • ఎస్సెస్సీ పరీక్షలను ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే నిర్వహిస్తున్నారన్న కుమారస్వామి
  • ప్రాంతీయ భాషలకు ఆప్షన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్న
  • దక్షిణాది రాష్ట్రాల్లోకి హిందీని చొప్పించడం కోసమే ఇదంతా చేస్తున్నారని విమర్శ
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) పరీక్షలను ఇంగ్లీష్, హిందీ భాషల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పరీక్షలను నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి విమర్శలు గుప్పించారు. ఎస్సెస్సీ ఉద్యోగాలను కేవలం ఇంగ్లీష్, హిందీ తెలిసిన వారికే ఇస్తారా? ప్రాంతీయ భాషలకు ఆప్షన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇతర భాషల ప్రజలపై హిందీని బలవంతంగా రుద్దడం ఏమిటని ప్రశ్నించారు. దక్షిణ భారతంలోకి హిందీని చొప్పించడం కోసమే ఇదంతా చేస్తున్నారని దుయ్యబట్టారు. కర్నాటకలోని ఉద్యోగాలను కన్నడిగులకే ఇవ్వాలని... పరీక్షలను కన్నడలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. 

మరోవైపు, కుమారస్వామి వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. 1975 నుంచి ఎస్సెస్సీ పరీక్షలను ఇంగ్లీష్, హిందీలో నిర్వహిస్తున్నారని... అప్పుడు బీజేపీ అధికారంలో లేదని బీజేపీ నేత బీసీ నాగేశ్ అన్నారు. దేవేగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ పరీక్షలను ఇంగ్లీష్, హిందీలోనే నిర్వహించారని చెప్పారు. అనవసర రాద్ధాంతం చేయడాన్ని మానుకోవాలని సూచించారు.
Kumaraswamy
JDS
BJP
SSC Exam

More Telugu News