Mohammed Shami: మహమ్మద్ షమీ దసరా వేడుకలు చేసుకుంటే తప్పేంటి?: కేంద్ర మంత్రి అనురాగ్
- దసరా పండుగను అందరూ జరుపుకుంటారన్న మంత్రి
- ఒక జాతిగా అందరూ ఐక్యంగా ఉండాలని పిలుపు
- షమీ దసరా శుభాకాంక్షలు చెప్పడంపై పెద్ద ఎత్తున ట్రోలింగ్
ప్రముఖ క్రికెటర్ మహమ్మద్ షమీకి కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మద్దతుగా నిలిచారు. ఈ నెల 5న విజయదశమి పర్వదినం. ఆ రోజున మహమ్మద్ షమీ తన అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలియజేశాడు. దీంతో అతడ్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దసరా రోజున షమీ శుభాకాంక్షలు చెప్పడాన్ని టార్గెట్ చేసుకున్నారు. షమీ మతాన్ని కూడా చర్చల్లోకి తీసుకొచ్చారు. హిందూ పండుగకు అతడు ఎందుకు శుభాకాంక్షలు చెప్పాడంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
‘‘సంతోషకరమైన దసరా పర్వదినం సందర్భంగా, మీ జీవితాలకు ఎంతో సంతోషం, ఐశ్వర్యం, విజయాన్ని అందించాలని దేవుడైన శ్రీరాముడిని వేడుకుంటున్నాను’’అని షమీ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. ఒకరి పండుగ రోజున మరొక మతానికి చెందిన వారు శుభాకాంక్షలు చెప్పే విధానం మన దేశంలో ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు.
ఈ అంశంపై కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ స్పందించారు. మహమ్మద్ షమీ దసరా పండుగ చేసుకోవడంలో తప్పేమీ లేదన్నారు. పండుగల సందర్భాల్లో యావత్ దేశం ఐక్యంగా ఉండడం ముఖ్యమన్నారు. ప్రతి క్రికెటర్ దసరా పండుగ జరుపుకున్నట్టు చెప్పారు. ‘‘దసరా అన్నది ఓ పండుగ. ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. భారత క్రికెటర్లు కూడా జరుపుకుంటున్నారు. మహమ్మద్ షమీ కూడా జరుపుకుంటే తప్పేంటి? దీన్ని వ్యతిరేకించే వారు దేశాన్ని విభజించాలని కోరుకునే వారే. ఒక జాతిగా మనమంతా కలసికట్టుగా పండుగలు చేసుకోవాలి’’అని ఠాకూర్ పేర్కొన్నారు.