Team India: టీమిండియాను వెంటాడుతున్న గాయాలు.. మరో ఆటగాడికి గాయం
- చీలమండ గాయానికి గురైన యువ పేసర్ దీపక్ చాహర్
- దక్షిణాఫ్రికాతో చివరి రెండు వన్డేల మ్యాచ్‌కు దూరం
- ప్రపంచ కప్ టీ20 జట్టులో స్టాండ్ బైగా ఉన్న చాహర్
టీ20 ప్రపంచకప్ ముంగిట భారత క్రికెటర్లను గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. రవీంద్ర జడేజా, జస్ ప్రీత్ బుమ్రా గాయాలతో ఇప్పటికే ఈ మెగా టోర్నీకి దూరమయ్యారు. తాజాగా యువ పేసర్ దీపక్ చాహర్‌కు కూడా గాయమైంది. దాంతో, దక్షిణాఫ్రికాతో చివరి రెండు వన్డేలకు అతను దూరం కానున్నాడు. తొలి మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్లో అతని చీలమండ బెణికింది. దాంతో, తొలి మ్యాచ్‌లో అతను ఆడలేదు. దీపక్ చాహర్ భారత ప్రపంచ కప్ జట్టులో స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్నాడు. దీపక్ గాయం చిన్నదేనని రెండు, మూడు రోజులు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందని జట్టు వర్గాలు చెబుతున్నాయి. ముందు జాగ్రత్తగా దక్షిణాఫ్రికాతో చివరి రెండు వన్డేల మ్యాచ్‌లకు దూరంగా ఉంచాలని నిర్ణయించినట్టు తెలిపాయి.
అయితే, దీపిక్ చాహర్‌కు అయింది చీలమండ గాయం కాదని, వెన్ను గాయం అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతను బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చేరాడు. మహ్మద్ షమీతో పాటు ఫిట్నెస్ నిరూపించుకుంటేనే అతను వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లనున్నాడు. ఇక, గాయంతో వరల్డ్‌కప్‌కు దూరమైన జస్ప్రీత్ బుమ్రా ప్లేస్‌లో జట్టులోకి వస్తాడని అనుకుంటున్న మహ్మద్ షమీ నెమ్మదిగా మ్యాచ్ ఫిట్నెస్ సాధిస్తున్నాడు. మూడు, నాలుగు రోజుల్లో తను ఆస్ట్రేలియా వెళ్లి జట్టుతో కలుస్తాడని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.