Adipurush: 'ఆదిపురుష్' చిత్రానికి మద్దతు ప్రకటించిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన

MNS extends support for Adipurush and team
  • ప్రభాస్ ఆదిపురుష్ చిత్రంపై వివాదం
  • రామాయణ పాత్రలను తప్పుగా చూపిస్తున్నారంటూ విమర్శలు
  • సినిమాను అడ్డుకుంటామని హెచ్చరికలు
  • ఈ బెదిరింపులు మహారాష్ట్రలో చెల్లవన్న ఎంఎన్ఎస్
రామాయణ పాత్రలను తప్పుగా చూపిస్తున్నారంటూ 'ఆదిపురుష్' దర్శకుడు ఓం రౌత్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) ఆదిపురుష్ చిత్రానికి మద్దతు ప్రకటించింది. ఎంఎన్ఎస్ పార్టీ నేత, సినీ నిర్మాత అమేయ ఖోప్కార్ దీనిపై స్పందించారు. 

"దర్శకుడు ఓం రౌత్ కు, ఆదిపురుష్ చిత్రానికి మేం మద్దతు ఇస్తున్నాం. ఈ సినిమా ఎలా విడుదలవుతుందో చూస్తామని మీరు (బీజేపీ) అంటున్నారు... కానీ మహారాష్ట్రలో ఇలాంటి గూండాగిరీ చెల్లదు. ఆదిపురుష్ సినిమా తప్పకుండా రిలీజ్ అవుతుంది... అందుకు మేం మద్దతుగా నిలుస్తాం" అని వెల్లడించారు. 

"కేవలం టీజర్ చూసి ఈ సినిమాను ఆపేస్తామంటూ మీ చెత్త రాజకీయాలు ప్రదర్శిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఆలోచించడం నేర్చుకోండి. ఇలాంటి కుటిల రాజకీయాలను ఎంఎన్ఎస్ అంగీకరించదు. ఓ సినిమాను అడ్డుకుంటాం అని ప్రకటించడం సులభమే... కానీ అదే సినిమా ఓ 500 మందికి అన్నం పెడుతుందన్న సంగతి మర్చిపోకూడదు. 

హిందూ అయినా, ముస్లిం అయినా... మేం అన్ని మతాలకు మద్దతు ఇస్తాం. మొదట ఈ సినిమా చూసి, ఆ తర్వాత ఏంచేయాలో నిర్ణయం తీసుకోండి. టీజర్ చూసి ఇది తప్పు, ఇది ఒప్పు అని నిర్ణయించలేరు. 

ఓం రౌత్ గొప్ప దర్శకుడు. గతంలో ఆయన తానాజీ, లోకమాన్య వంటి మంచి చిత్రాలను తెరకెక్కించారు. ఓం రౌత్ నిజమైన హిందుత్వవాది. అతని గురించి నాకు బాగా తెలుసు. దేవుళ్లు, దేవతలకు వ్యతిరేకంగా అతడు సినిమా తీయడు" అంటూ అమేయ ఖోప్కార్ వెల్లడించారు.
Adipurush
MNS
Om Raut
BJP
Maharashtra
Bollywood

More Telugu News