TDP: రెండో రోజూ ఈడీ విచారణకు హాజరైన జేసీ ప్రభాకర్ రెడ్డి... 10 గంటల పాటు సాగిన విచారణ
- వాహనాలను అక్రమంగా రిజిస్టర్ చేయించారని జేసీపై కేసు
- శుక్రవారం తొలిసారిగా ఈడీ విచారణకు వచ్చిన టీడీపీ నేత
- నాగాలాండ్‌లో వాహనాలను రిజిస్టర్ చేయించానని వెల్లడి
- అక్కడ తక్కువ చార్జీలే కారణమని వివరణ
వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డారన్న అభియోగాలను ఎదుర్కొంటున్న టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి శనివారం వరుసగా రెండో రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. రెండో రోజు ఆయనను ఈడీ అధికారులు దాదాపుగా 10 గంటల పాటు విచారించారు. శుక్రవారం తొలి రోజు ఆయన హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.
రెండో రోజు విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ప్రభాకర్ రెడ్ది... బీఎస్ 3 వాహనాల రిజిస్ట్రేషన్లపైనే తనను ఈడీ అధికారులు విచారించారని తెలిపారు. నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చార్జీలు తక్కువగా ఉన్నందునే తాను తన వాహనాలను అక్కడ రిజిస్టర్ చేయించినట్లుగా ఆయన తెలిపారు. ఈ వ్యవహారంలో మనీ ల్యాండరింగ్ జరిగిందన్న విషయాన్ని ఈడీ అధికారులే తేలుస్తారన్నారు. ఇకపై ఈడీ అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని, ఈ విషయంలో తనకేమీ ఇబ్బంది లేదని ఆయన తెలిపారు.