Surrogacy: సరోగసీపై సీనియర్ నటి కస్తూరి ట్వీట్... ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నయనతార అభిమానులు
- సరోగసీ ద్వారా కవలలను పొందిన నయన్, విఘ్నేష్ దంపతులు
- దేశంలో ఈ చట్టాన్ని నిషేధించారంటూ కస్తూరి ట్వీట్
- నయన్ అభిమానులకు ఘాటుగా సమాధానమిచ్చిన కస్తూరి
- అయినా ఆగని ట్రోలింగ్
సరోగసీ (అద్దె గర్భం)పై సీనియర్ నటి కస్తూరి సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ప్రముఖ నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులు సరోగసీ ద్వారానే కవల పిల్లలకు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ఆదివారం నయన్ దంపతులు సరోగసీ ద్వారా కవలలను పొందినట్టు వెల్లడైన కాసేపటికే కస్తూరి సరోగసీపై ట్వీట్ చేయడం గమనార్హం.
"భారతదేశంలో సరోగసీపై నిషేధం ఉంది. 2022 జనవరి నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. క్లిష్ట పరిస్థితుల్లో తప్ప సరోగసీని అనుమతించరు. రానున్న రోజుల్లో దీని గురించి ఎక్కువగా వినబోతున్నాం" అని ఆమె తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను చూసినంతనే నయన్ అభిమానులు కస్తూరిపై మండిపడ్డారు. మీ పని మీరు చూసుకుంటే మంచిదంటూ ఆమెపై ట్రోలింగ్ మొదలెట్టారు.
ఈ ట్రోలింగ్‌పైనా కస్తూరి వెనువెంటనే స్పందించారు. "అర్హత కలిగిన న్యాయవాదిగా ఈ చట్టంపై విశ్లేషణ చేసే హక్కు నాకుంది. నేను ఎవరినీ ఉద్దేశించి ఈ ట్వీట్ పోస్ట్ చేయలేదు" అని కస్తూరి ట్రోలర్లకు నేరుగానే రిప్లై ఇచ్చారు. ఈ రిప్లై ఇచ్చాక కూడా కస్తూరిపై ట్రోలింగ్ ఆగలేదు.