YSRCP: వివేకా హత్య కేసు నిందితులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
- వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి
- దస్తగిరికి క్షమాభిక్షను సవాల్ చేస్తూ పిటిషన్
- కేసులో నిందితులుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, గజ్జల ఉమాశంకర్ రెడ్డిల పిటిషన్
- క్షమాభిక్ష రద్దు చేయాలని కోరే హక్కు సహ నిందితులకు లేదన్న సుప్రీం
వైసీపీ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న వారికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదరైంది. ఈ కేసులో కీలక నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, గజ్జల ఉమాశంకర్ రెడ్డిలు దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.
వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదించడాన్ని సవాల్ చేస్తూ శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డిలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. క్షమాభిక్ష రద్దు చేయాలని కోరే హక్కు సహ నిందితులుగా ఉన్న వారికి లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
దస్తగిరికి క్షమాభిక్ష ను సవాల్ చేస్తూ ఇదివరకే శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డిలు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా... కోర్టు అందుకు తిరస్కరించింది. జిల్లా కోర్టు తీర్పుపై జోక్యం చేసుకోవాలంటూ వారిద్దరూ ఏపీ హైకోర్టును ఆశ్రయించగా... అక్కడా వారికి నిరాశే ఎదురైంది. మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డిలు చివరి అవకాశంగా సుప్రీంకోర్టును ఆశ్రయించగా... అక్కడ కూడా వారికి చుక్కెదురైంది.