Ukraine: వంతెన పేల్చివేతకు ప్రతీకారం... ఉక్రెయిన్ నగరాలపై 83 క్షిపణులను ప్రయోగించిన రష్యా
- రష్యా, క్రిమియా మధ్య కెర్చ్ వంతెన
- ఇటీవల వంతెనపై భారీ పేలుడు
- ఉక్రెయిన్ పనే అని రష్యా అనుమానం
- కీవ్ ను కూడా తాకేలా క్షిపణుల ప్రయోగం
- రష్యా తదుపరి లక్ష్యం తమ పౌరులేనన్న జెలెన్ స్కీ
రష్యా, క్రెమ్లిన్ ప్రాంతాలను అనుసంధానం చేసే కీలకమైన కెర్చ్ వారధి పేల్చివేతను వ్లాదిమిర్ పుతిన్ అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వంతెన పేల్చివేత వెనుక ఉక్రెయిన్ హస్తం ఉందని రష్యా ప్రభుత్వం ఆరోపించింది. ఇది ఉక్రెయిన్ ప్రభుత్వ ప్రోద్బలిత ఉగ్రవాదం అని పేర్కొంది.
ఈ నేపథ్యంలో, ఉక్రెయిన్ నగరాలపై తాజాగా రష్యా సైన్యం ఏకంగా 83 క్షిపణులను ప్రయోగించింది. గత కొన్నివారాలుగా ప్రశాంతంగా ఉన్న ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను కూడా కొన్ని క్షిపణులు తాకినట్టు వెల్లడైంది. భారీ శబ్దాలతో కీవ్ దద్దరిల్లింది. ఈ దాడుల్లో 8 మంది పౌరులు మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు.
రష్యా భీకరస్థాయిలో క్షిపణి దాడులకు పాల్పడడాన్ని ఉక్రెయిన్ ఆర్మీ చీఫ్ జనరల్ వాలెరి జలూజ్నీ నిర్ధారించారు. అయితే, రష్యా ప్రయోగించిన వాటిలో సగం క్షిపణులను తమ బలగాలు గగనతలంలోనే నిరోధించాయని జలూజ్నీ చెప్పారు.
అటు, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ కూడా రష్యా తాజా దాడులపై స్పందించారు. దేశంలోని అనేక నగరాలు రష్యా క్షిపణి దాడులకు గురయ్యాయని తెలిపారు. పలు నగరాల్లో పౌరులు మృతి చెందారని, అనేకమంది క్షతగాత్రులయ్యారని వివరించారు.
రష్యా దాడుల తీవ్రత చూస్తుంటే ఈ భూమ్మీద నుంచి తమను తుడిచిపెట్టేయాలన్న ఉద్దేశం కనిపిస్తోందని జెలెన్ స్కీ పేర్కొన్నారు. ప్రధానంగా తమ నగరాల్లోని విద్యుత్, ఇంధన, మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేసినట్టు వెల్లడించారు. ఇక రష్యన్ల తదుపరి లక్ష్యం తమ పౌరులేనని వ్యాఖ్యానించారు.