Mumbai: ఆకలేస్తోందని సమోసా కొంటే.. కొరకగానే కాగితం కనిపించింది: క్షమించమన్న ఐఆర్సీటీసీ
- ముంబై-లక్నో రైలులో ఘటన
- సమోసాను ట్వీట్ చేసిన ప్రయాణికుడు
- రైల్వే సేవలు అధ్వానంగా తయారవుతున్నాయంటూ నెటిజన్ల పైర్
ఆకలేస్తోందని రైలులో సమోసా కొన్న ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. దానిని కొరకగానే అందులో ఓ పచ్చ కాగితం కనిపించింది. అంతే.. దానిని తినడం మాని ఫొటో తీసి ట్విట్టర్లో షేర్ చేశాడు. స్పందించిన ఐఆర్సీటీసీ క్షమాపణలు కోరింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. అజి కుమార్ అనే వ్యక్తి ఈ నెల 9న ముంబై నుంచి లక్నోకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఐఆర్సీటీసీ ప్యాంట్రీ సిబ్బంది విక్రయించిన సమోసా కొన్నాడు. సమోసాను కొరకగానే అందులో పచ్చరంగులో ఉన్న కాగితం కనిపించింది. వెంటనే దానిని ఫొటో తీసిన అజి కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు.
దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. రైల్వే వ్యవస్థ రోజురోజుకు మరింత దారుణంగా తయారవుతోందంటూ విరుచుకుపడ్డారు. టికెట్ కన్ఫర్మేషన్ సహా పలు అంశాల్లో రైల్వే వ్యవస్థ మరీ తీసికట్టుగా తయారవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి దానికి డబ్బులు వసూలు చేస్తున్నా సేవలు మాత్రం అధ్వానంగా ఉంటున్నాయని విమర్శలు గుప్పించారు. దీంతో స్పందించిన ఐఆర్సీటీసీ అజి కుమార్ను క్షమించమని వేడుకుంది. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, మీ పీఎన్ఆర్, మొబైల్ నంబరును డీఎంలో షేర్ చేయాలని కోరింది. ఈ ఘటనను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది.