Andhra Pradesh: వెళ్తూ వెళ్తూ కుండపోత వానలు కురిపిస్తున్న ‘నైరుతి’.. ఏపీలో మరికొన్ని రోజులు వర్షాలు!
- సెప్టెంబరు మూడో వారంలోనే ప్రారంభమైన నైరుతి నిష్క్రమణ
- దేశవ్యాప్తంగా కురుస్తున్న వానలు
- బంగాళాఖాతంలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు
- ఏపీలో నిన్న కూడా భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాలు వెళ్తూ వెళ్తూ కుమ్మేస్తున్నాయి. ఎన్నడూ లేనంతంగా ఈసారి తిరోగమన సమయంలోనూ నైరుతి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. సెప్టెంబరు మూడో వారంలోనే ‘నైరుతి’ నిష్క్రమణ ప్రారంభమైంది. ఫలితంగా అక్టోబరు తొలి వారానికే అవి పూర్తిగా ముఖం చాటేయాల్సి ఉండగా తిరోగమన సమయంలోనూ దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. నిజానికి అక్టోబరు తొలి వారంలో అల్పపీడనాలు ఏర్పడడం చాలా అరుదు. కానీ ఈసారి మాత్రం పలు అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. వీటికి తోడు ద్రోణులు సరేసరి. వీటి ప్రభావంతో దక్షిణ భారతం నుంచి ఉత్తరాది వరకు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
ప్రస్తుతం శ్రీలంక సమీపంలో నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు పరిసరాల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. ఈ వారంలో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు పసిఫిక్ మహా సముద్రంలో లానినా ప్రభావం కొనసాగుతోంది. దీంతో సముద్రం నుంచి తూర్పు గాలులు బలంగా వీస్తున్నాయి. కాగా, ఏపీలో నిన్న పలు చోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.