Pramod Sawant: గోవా ముఖ్యమంత్రి మాంసం తిని గుడికి వెళ్లాడు... కాంగ్రెస్ ఆరోపణలు
- కర్ణాటకలోని ఉడుపిలో పర్యటించిన గోవా సీఎం ప్రమోద్ సావంత్
- ఓ వైద్యుడి విందుకు హాజరు
- అనంతరం శ్రీకృష్ణ ఆలయ సందర్శన
- స్పందించిన కాంగ్రెస్ నేత రమేశ్ కంచన్
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పై కర్ణాటక కాంగ్రెస్ నేత రమేశ్ కంచన్ తీవ్ర ఆరోపణలు చేశారు. గోవా సీఎం ఉడుపిలోని శ్రీకృష్ణ ఆలయ సందర్శనకు ముందు మాంసాహార భోజనం తిన్నారని కంచన్ వెల్లడించారు. మాంసం తిని ఆలయానికి రావడమే కాదు, వేదపండితుల నుంచి తీర్థప్రసాదాలు కూడా స్వీకరించారని తెలిపారు.
విచక్షణలేని వ్యక్తి అంటూ మాజీ సీఎం సిద్ధరామయ్యపై విమర్శలు చేస్తున్న బీజేపీ నాయకత్వం, ఇప్పుడు వారి పార్టీ నేతలు ఎలాంటి తప్పులకు పాల్పడుతున్నారో గుర్తించాలని కంచన్ హితవు పలికారు. సిద్ధరామయ్యను, ఇతర కాంగ్రెస్ నేతలను విమర్శించే నైతిక హక్కు బీజేపీకి ఎలా ఉంటుంది? అని ప్రశ్నించారు. ఇతరులను వేలెత్తి చూపేముందు, వారి తప్పులేంటో తెలుసుకోవాలని రమేశ్ కంచన్ వ్యాఖ్యానించారు.
దీనిపై ఉడుపి నగర బీజేపీ అధ్యక్షుడు మహేశ్ ఠాకూర్ స్పందించారు. రమేశ్ కంచన్ వ్యాఖ్యలు అర్థరహితమని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
కాగా, ఉడుపి పర్యటనకు వచ్చిన గోవా సీఎం ప్రమోద్ సావంత్.... స్థానికంగా ప్రసాద్ నేత్రాలయ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ కృష్ణప్రసాద్ ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ఈ విందులోనే ఆయన మాంసాహారం తిన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అయితే గోవా సీఎం కేవలం శాకాహార వంటకాలే తిన్నారని డాక్టర్ కృష్ణప్రసాద్ అంటున్నారు.