MS Dhoni: నేను టెన్త్ పాసవుతానని మా నాన్న అనుకోలేదు: ధోనీ

Dhoni reveals his Tenth class marks

  • క్రికెట్ లో లెజెండ్ గా ఎదిగిన ధోనీ
  • చదువులో తాను యావరేజి అని వెల్లడి
  • టెన్త్ లో 66 శాతం వచ్చాయన్న జార్ఖండ్ డైనమైట్
  • ఇంటర్ లోనూ మంచి మార్కులే వచ్చాయని వివరణ

భారత క్రికెట్ గతిని మార్చిన వారిలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ముందువరుసలో ఉంటాడు. రెండు వరల్డ్ కప్ లు అందించడమే కాదు, టెస్టు ఫార్మాట్ లోనూ టీమిండియాను అగ్రస్థానం దిశగా నడిపించాడు. అటు ఐపీఎల్ లోనూ చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ఆ జట్టును నాలుగుసార్లు చాంపియన్ గా నిలిపాడు. వికెట్ కీపింగ్, బ్యాటింగ్, కెప్టెన్సీ... ఇలా తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ దిగ్గజంగా నిలిచాడు. 

తాజాగా ఓ కార్యక్రమంలో ధోనీ ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. చదువులో తన పరిస్థితి ఏంటో వివరించాడు. తాను కనీసం టెన్త్ కూడా పాస్ కాలేనని తన తండ్రి భావించేవాడని ధోనీ తెలిపాడు. 

ఏడో తరగతిలో తాను క్రికెట్ ఆడడం ప్రారంభించే సమయానికి యావరేజి స్టూడెంట్ నని, ఆ తర్వాత నుంచి హాజరు క్రమంగా తగ్గడం మొదలైందని పేర్కొన్నాడు. అయినప్పటికీ, టెన్త్ క్లాస్ కు వచ్చేసరికి తాను మంచి విద్యార్థిగానే గుర్తింపు తెచ్చుకున్నానని, టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో తనకు 66 పర్సంటేజీతో మార్కులు వచ్చాయని ఈ జార్ఖండ్ డైనమైట్ వెల్లడించాడు. ఇంటర్ లో 57 శాతం మార్కులు వచ్చాయని తెలిపాడు. 

క్రికెట్ కారణంగా తాను క్లాసులకు హాజరైంది చాలా తక్కువని, టెన్త్ క్లాసులో కొన్ని చాప్టర్లు తాను చదవనేలేదని పేర్కొన్నాడు. పబ్లిక్ పరీక్షల్లో ఆ చాప్టర్ల నుంచి ప్రశ్నలు వచ్చుంటే తన పని గోవిందా! అని చమత్కరించాడు. 

నేను టెన్త్ పాస్ కాలేనని భావించిన మా నాన్నతో నేను పాసయ్యానని చెప్పడం ఇంకా గుర్తుందని అన్నాడు. "నేను పాసయ్యానని మా నాన్నకు పదేపదే చెప్పాల్సి వచ్చింది. నేను టెన్త్ పాసయ్యానని తెలిసి ఆయన చాలా సంతోషించారు" అని ధోనీ వివరించాడు. ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ధోనీ పైవిధంగా బదులిచ్చాడు.

  • Loading...

More Telugu News