TRS: ఢిల్లీలో కేసీఆర్... బీఆర్ఎస్ కార్యాలయాన్ని పరిశీలించిన తెలంగాణ సీఎం
- ములాయం అంత్యక్రియలకు హాజరైన కేసీఆర్
- ఆ తర్వాత యూపీ నుంచే ఢిల్లీకి పయనం
- సర్దార్ పటేల్ మార్గ్‌లోని బీఆర్ఎస్ కార్యాలయానికి చేరిక
- పలు పార్టీల నేతలు, మేథావులతో భేటీ కానున్న సీఎం
తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం సాయంత్రానికి ఢిల్లీ చేరుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు మంగళవారం మధ్యాహ్నం ఉత్తర ప్రదేశ్ వెళ్లిన కేసీఆర్... ములాయం అంత్యక్రియలు ముగిసిన తర్వాత అటు నుంచి అటే ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో ఇటీవలే ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రాంతీయ కార్యాలయాన్ని పరిశీలించారు.
ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణ పనులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ భవన నిర్మాణం పూర్తి అయ్యే దాకా కొత్తగా ప్రకటించిన బీఆర్ఎస్ కార్యాలయం కోసం సర్దార్ పటేల్ మార్గ్‌లోని ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ప్రకటన రోజే ఈ భవనానికి బీఆర్ఎస్ రంగులు అద్దారు. ఈ కార్యాలయాన్నే కేసీఆర్ మంగళవారం పరిశీలించారు.
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత కేసీఆర్ ఢిల్లీకి రావడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయంలో ఆయన పలు పార్టీలకు చెందిన నేతలతో పాటు మేథావులతోనూ చర్చలు జరపనున్నట్లు సమాచారం. అయితే ఈ టూర్‌లో కేసీఆర్ ఎవరెవరిని కలుస్తారన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు.