Sirimanotsavam: విజయనగరంలో అత్యంత ఘనంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం
- దసరా అనంతరం వచ్చే తొలి మంగళవారం అమ్మవారికి ఉత్సవం
- సిరిమానును అధిరోహించిన పూజారి వెంకటరావు
- భారీగా తరలివచ్చిన భక్తులు
- హాజరైన ఏపీ మంత్రులు, ఇతర నేతలు
ప్రతి ఏడాది విజయదశమి అనంతరం తొలి మంగళవారం విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జరుగుతుంది. ఈ క్రమంలో విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అత్యంత వేడుకగా నిర్వహించారు.
ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమానును అధిరోహించగా, విజయనగరం వీధుల్లో భారీ భక్త జనసందోహం నడుమ ఊరేగింపు జరిపారు. ఆలయం నుంచి మూడు లాంతర్ల సెంటర్ మీదుగా కోట వరకు మూడు పర్యాయాలు సిరిమాను ఊరేగింపు నిర్వహించారు.
అంతకుముందు, ఏపీ ప్రభుత్వం తరఫున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పైడితల్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కాగా, సిరిమానోత్సవం సందర్భంగా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తదితరులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త, మాన్సాస్ ట్రస్టు చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.