Allu Aravind: చిరంజీవి మా ఇంటి అల్లుడు కావడానికి ఆమే కారణం: అల్లు అరవింద్

Allu Aravind about Chiranjeevi marriage
  • మా అమ్మ వల్లే చిరంజీవి మా ఇంటి అల్లుడు అయ్యారన్న అరవింద్
  • చిరంజీవిపై తన తండ్రి కొన్ని రోజులు నిఘా పెట్టారని వెల్లడి
  • మంచి వ్యక్తి అని నిర్ధారించుకున్న తర్వాత సురేఖను ఇచ్చామన్న అరవింద్
మెగాస్టార్ చిరంజీవి, సినీ నిర్మాత అల్లు అరవింద్ ల అనుబంధం ఎంత బలమైందో అందరికీ తెలిసిందే. బావా, బావమరిది అయిన వీరిద్దరూ దశాబ్దాలు గడుస్తున్నా అదే ప్రేమ, అదే ఆప్యాయతతో కలిసిమెలిసి ఉంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ మాట్లాడుతూ... చిరంజీవి తమ ఇంటి అల్లుడు ఎలా అయ్యారో వెల్లడించారు. 

చిరంజీవిని తాను తొలిసారి చలసాని గోపి ఆఫీసులో కలిశానని... అప్పుడు ఇద్దరం షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నామని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ హ్యాండ్ తమతోనే ఉందని అల్లు అరవింద్ చెప్పారు. చెన్నైలో ఆ రోజుల్లో తమ ఇంటిపైన సత్యనారాయణ అని ఒక వ్యక్తి ఉండేవారని... ఆయనను కలవడానికి ఒక రోజు చిరంజీవి వచ్చారని తెలిపారు. చిరంజీవి వెళ్లిపోయిన తర్వాత అతను ఎవరు అని సత్యనారాయణను మా అమ్మ అడిగిందని... దీంతో ఆయన చిరంజీవి గురించి వివరించారని చెప్పారు. చిరంజీవి మన వాడేనా అని అమ్మ అడిగిందని... ఆ తర్వాత రాత్రి నాన్న వచ్చిన తర్వాత చిరంజీవి గురించి చెపుతూ విసిగించిందని తెలిపారు. చాలా రోజుల పాటు చిరంజీవి గురించి అమ్మ పోరు పెడుతూనే ఉందని చెప్పారు. 

ఆ తర్వాత ఒక సినిమా కోసం నాన్న, చిరంజీవి 20 రోజుల పాటు రాజమండ్రిలో ఉన్నారని... ఆ సమయంలో చిరంజీవిపై నాన్న పూర్తి నిఘా పెట్టారని... చిరంజీవి మంచి వ్యక్తి అని తెలుసుకున్న తర్వాత... సురేఖను చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారని తెలిపారు. ఆ విధంగా చిరంజీవి తమ ఇంటి అల్లుడు అయ్యారని చెప్పారు. అమ్మ వల్లే ఈ పెళ్లి జరిగిందని అన్నారు.
Allu Aravind
Chiranjeevi
Tollywood

More Telugu News