T20 World Cup: ప్రపంచంలోనే అత్యుత్తమ కారు.. గ్యారేజ్ లో పెట్టేశారు: ఇండియా స్క్వాడ్ పై బ్రెట్ లీ
- టీ20 ప్రపంచకప్ బృందంపై బ్రెట్ లీ అభిప్రాయం
- జస్ప్రీత్ బుమ్రాను ఉద్దేశించి వ్యాఖ్య
- బుమ్రా లేకపోవడం భారత్ కు నష్టమన్న ఆస్ట్రేలియా వెటరన్
టీ20 ప్రపంచకప్ కు బీసీసీఐ ఎంపిక చేసిన స్క్వాడ్ పట్ల ఆస్ట్రేలియా వెటరన్ క్రికెటర్ బ్రెట్ లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 15 మందితో కూడిన భారత్ బృందం పట్ల ఎన్నో విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలో బ్రెట్ లీ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, స్పిన్ మాంత్రికుడు జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ కప్ కు దూరం కాగా, గాయం కారణంగా దీపక్ చాహర్ కూడా అందుబాటులో లేకుండా పోయాడు. సెలక్టర్లు అనుభవం కలిగిన మహమ్మద్ షమీని అసలు ఎంపిక చేసుకోలేదు. ఉమ్రాన్ మాలిక్, సిరాజ్ ఆస్ట్రేలియాకు ప్రయాణం అవుతున్నట్టు తాజా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆస్ట్రేలియా క్రికెటర్ బ్రెట్ లీ స్పందించాడు.
‘‘ఉమ్రాన్ మాలిక్ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తాడు. ప్రపంచంలోనే మంచి కారు మీ దగ్గర ఉన్నప్పుడు దాన్ని గ్యారేజ్ లో ఉంచేస్తే ఏం ప్రయోజనం? ప్రపంచకప్ స్క్వాడ్ కు ఉమ్రాన్ మాలిక్ ను ఎంపిక చేసుకోవాలి’’అని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఉమ్రాన్ యువకుడే అయినా 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడాన్ని సానుకూలతగా పేర్కొన్నాడు. 140 కిలోమీటర్ల వేగానికి, 150 కిలోమీటర్ల వేగానికి మధ్య వ్యత్యాసం ఉందన్నాడు. అయినా కానీ ఉమ్రాన్ ఆడే అవకాశాలు తక్కువేనని అభిప్రాయపడ్డాడు.
జస్ప్రీత్ బుమ్రా గాయపడడం అన్నది ప్రపంచకప్ లో భారత విజయావకాశాలకు పెద్ద విఘాతమన్నాడు బ్రెట్ లీ. వారు విజయం సాధించలేరన్నది తన ఉద్దేశ్యం కాదంటూ.. భారత్ కు జస్ప్రీత్ బుమ్రాయే బలమని పేర్కొన్నాడు. అతడు లేకపోవడంతో భువనేశ్వర్ కుమార్ వంటి బౌలర్లపై ఒత్తిడి పెరుగుతుందని వ్యాఖ్యానించాడు.