Dharmana Prasada Rao: విజయవాడ, అమరావతికి ఇతరులు వెళ్లలేని పరిస్థితి ఉంది: ధర్మాన ప్రసాదరావు
- ఇతరులు విజయవాడ, అమరావతికి వెళ్లలేని పరిస్థితిని సృష్టించారన్న ధర్మాన
- అమరావతిలో పేద కుటుంబం ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉందని వ్యాఖ్య
- అన్ని ప్రాంతాల ప్రజలు నివసించే పరిస్థితి విశాఖలో మాత్రమే ఉందన్న మంత్రి
అన్ని ప్రాంతాల వారు ప్రశాంతంగా నివసించే పరిస్థితి విజయవాడ, అమరావతిలో లేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ రెండు చోట్ల యాక్సెప్టబుల్ కల్చర్ లేదని చెప్పారు. ఇతరులు అక్కడకు వెళ్లలేని పరిస్థితిని సృష్టించారని అన్నారు. అమరావతి చుట్టూ ఉన్న భూములు కేవలం కొందరి చేతుల్లోనే ఉన్నాయని తెలిపారు. అమరావతి ప్రాంతంలో పేద కుటుంబం ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉందని చెప్పారు. ఇతరులకు ఆమోదయోగ్యం కాని ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేస్తే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు ప్రశాంతంగా నివసించే పరిస్థితులు కేవలం వైజాగ్ లో మాత్రమే ఉన్నాయని చెప్పారు.
ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందక ఇక్కడి ప్రజలు బాధపడుతున్నారని ధర్మాన అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఇక్కడి పరిస్థితిలో మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ తమ ప్రాంతాన్ని దోచుకునే కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు. ఈ ప్రాంతానికి చంద్రబాబు అన్యాయం చేశారని... వంశధార ప్రాజెక్టు కోసం వైయస్ రాజశేఖరరెడ్డి రూ. 1,000 కోట్లు కేటాయించారని అన్నారు.