Dhulipala Narendra Kumar: మెడపై కత్తి పెట్టి.. విజయసాయిరెడ్డి భూముల ఒప్పందాలు చేసుకున్నది నిజం కాదా?: ధూళిపాళ్ల నరేంద్ర

Dhulipalla Narendra comments on Vijayasai Reddy on Vizag lands

  • విజయసాయి కూతురు, అల్లుడికి వేల కోట్ల ప్రాజెక్టులు ఎలా వచ్చాయన్న ధూళిపాళ్ల
  • ఎంపీ హోదాలో సీబీఐ విచారణ కోరే దమ్ముందా అని ప్రశ్న
  • టీవీ చానల్ పెట్టి ఏం ఊడబెరుకుతాడంటూ ఎద్దేవా

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి భూ దోపిడీకి పాల్పడ్డారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలోనే తన కుమార్తె, అల్లుడి కంపెనీలకు వేల కోట్ల ప్రాజెక్టులు, వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని అన్నారు. జగన్ సీఎం కాకముందు అరబిందో కంపెనీ పరిస్థితి ఏమిటి? ప్రస్తుత పరిస్థితి ఏమిటి? అనేది విజయసాయి చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ బినామీ, ఏ2 విజయసాయి రెడ్డి సాగించిన భూ దోపిడీ ఉత్తరాంధ్రను కోలుకోని విధంగా దెబ్బతీసిందని అన్నారు. భూ దోపిడీ, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల దోపిడీపై ఎంపీ హోదాలో సీబీఐ విచారణ కోరే దమ్ముందా అని ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

పంచగ్రామాల క్రమబద్ధీకరణ, భోగాపురం ఎయిర్ పోర్ట్, అనకాపల్లి భూములు, స్వచ్ఛంద సంస్థ ప్రేమసమాజం భూములు వేటినీ వదల్లేదని ధూళిపాళ్ల మండిపడ్డారు. వందల కోట్ల విలువైన దసపల్లా భూములను కొట్టేయడం కోసమే ఉమేశ్, గోపీనాథ్ రెడ్డిల అష్యూర్ డెవలపర్స్ సంస్థ పుట్టుకొచ్చిందని అన్నారు. భూ యజమానులుగా ఉన్నవారి మెడపై కత్తిపెట్టి మరీ ఒప్పందాలు చేసుకున్నది నిజంకాదా? అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి కుమార్తె, అల్లుడికి చెందిన అవ్యాన్ రియల్టర్స్ ద్వారా అష్యూర్ డెవలపర్స్ కు డబ్బుచేరిందని చెప్పారు.

అభివృద్ధి పేరుతో 70 శాతం భూమిని డెవలపర్స్ కు, 30 శాతం భూమిని యజమానులకు కేటాయించడం మాయాజాలం కాదా? అని ప్రశ్నించారు. భూయజమానులకు 30 శాతం, అభివృద్ధి చేసేవారికి 70 శాతమనేది దేశంలోనే పెద్ద వింత అని... అలాంటి వింతలు ఏపీలోనే జరుగుతాయని విమర్శించారు. గతంలో దసపల్లా భూములకు సంబంధించి దొంగ దీక్షలు చేసి, పసలేని ఆరోపణలు చేసిన గుడివాడ అమర్ నాథ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర బీసీలపై జగన్ రెడ్డికి ప్రేమే ఉంటే, ఆ ప్రాంతానికి విజయసాయిరెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డిలను ఎందుకు ఇన్ ఛార్జ్ లుగా నియమించారని అడిగారు. 

ఎలా చూసినా, తాము, తమ కుటుంబ సంస్థలు తప్ప, ఇంకేవీ రాష్ట్రంలో ఉండకూడదన్నదే జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డిల ఆలోచన అని ధూళిపాళ్ల అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక వ్యక్తిగా ఉన్న విజయసాయిరెడ్డి బంధువు శరత్ చంద్రారెడ్డి సంగతేంటని ప్రశ్నించారు. ఢిల్లీలో కాళ్లుపట్టుకోవడం.. రాష్ట్రంలో కాలర్ ఎగరేయడం విజయసాయికి బాగా తెలిసిన విద్య అని ఎద్దేవా చేశారు. తనకు ట్రిపుల్ బెడ్రూమ్ ప్లాట్ తప్ప ఏమీ లేదన్న విజయసాయి రూ. 1000 కోట్లతో ఒక పత్రిక, ఛానెల్ ఎలా పెడతాడో చెప్పాలని డిమాండ్ చేశారు. దోపిడీ సొమ్ముతో ఛానెల్, పత్రిక పెట్టిన జగన్ రెడ్డి ఏం సాధించాడు? విజయసాయి ఏం ఊడబెరుకుతాడు? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News