T20 World Cup: సినిమా థియేటర్లలోనూ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు
- ఈ నెల 22 నుంచి టీ20 వరల్డ్ కప్
- భారత్ ఆడే మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనున్న ఐనాక్స్
- బిగ్ స్క్రీన్‌పై మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం కోసం ఐసీసీతో ఒప్పందం
- 25 నగరాల్లోని\ మల్టీప్లెక్స్‌ల్లో మ్యాచ్‌లను ప్రసారం చేయనున్న ఐనాక్స్
క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీ20 వరల్డ్ కప్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. ఈ నెల 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం ఇప్పటికే అన్ని దేశాల క్రికెట్ జట్లు అక్కడికి చేరుకున్నాయి. ఈ నెల 16 నుంచి 21 దాకా కొన్ని దేశాల జట్ల మధ్య అర్హత మ్యాచ్‌లు జరగనుండగా... అసలైన సమరం ఈ నెల 22 నుంచి మొదలు కానుంది. ఈ మ్యాచ్‌ల వీక్షణ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పటికే తమ తమ ప్లాన్‌లను సిద్ధం చేసుకున్నారు కూడా.
ఇప్పటిదాకా క్రికెట్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా స్టేడియంలలో, పరోక్షంగా బుల్లి తెరల మీద మాత్రమే వీక్షించి ఉంటాం. అయితే త్వరలో మొదలు కానున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లను బుల్లి తెరతో పాటు బిగ్ స్క్రీన్ (సినిమా థియేటర్)లలోనూ వీక్షించవచ్చు. అందుకోసం దేశీయ మల్టీప్లెక్స్ దిగ్గజం ఐనాక్స్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఆడే అన్ని మ్యాచ్‌లతో పాటు సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లను ఐనాక్స్ తన మల్టీప్లెక్స్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ మేరకు ఐసీసీతో ఐనాక్స్ ఓ ఒప్పందం కుదుర్చుకుంది.
ఐకాన్స్‌కు ప్రస్తుతం దేశంలోని 74 నగరాల్లో 165 మల్టీప్లెక్సులు ఉన్నాయి. వీటిలో 705 స్క్రీన్స్ ఉన్నాయి. వీటిలో ఏకంగా 1.5 లక్షల సీటింగ్ కెపాసిటీ కూడా ఉంది. అయితే ఐసీసీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 25 నగరాల్లో మాత్రమే ఐనాక్స్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లను ప్రసారం చేయనుంది. ఈ నగరాల జాబితాను ఐనాక్స్ త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం.