Myanmar: ఆంగ్‌సాన్ సూకీపై లంచం ఆరోపణలు.. 26 ఏళ్లకు పెరిగిన జైలు శిక్ష

Myanmar Aung San Suu Kyis prison term extended to 26 years
  • డ్రగ్ డీలర్ నుంచి లంచం తీసుకున్న కేసులో దోషిగా తేల్చిన న్యాయస్థానం
  • మూడేళ్ల జైలు శిక్ష విధింపు
  • మరికొన్ని కేసుల్లో 23 ఏళ్ల జైలు శిక్ష
  • 1991లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్న సూకీ
మయన్మార్‌కు చెందిన నోబెల్ పురస్కార గ్రహీత, హక్కుల నేత ఆంగ్‌సాన్ సూకీ జైలు శిక్షను అక్కడి న్యాయస్థానం 26 సంవత్సరాలకు పొడిగించింది. గతేడాది ఫిబ్రవరిలో సూకీ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న సైన్యం.. ఆమెపై పలు అభియోగాలు మోపి జైలుపాలు చేసింది. డ్రగ్స్ తరలించే వ్యాపారి మౌంగ్ వీక్ నుంచి 5.50 లక్షల డాలర్ల లంచం తీసుకున్నట్టు సూకీపై సైనిక ప్రభుత్వం అభియోగాలు మోపింది. ఈ కేసులో ఆమెను దోషిగా తేల్చిన న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే, ఆమెపై మరికొన్ని అభియోగాలు కూడా ఉన్నాయి. 

కరోనా నిబంధనలను ఉల్లంఘించారని, వాకీటాకీలను అక్రమంగా దిగుమతి చేసుకున్నారని, అధికార రహస్యాలను బహిర్గతం చేశారని, దేశద్రోహం, ఎన్నికల్లో అవినీతి వంటి అభియోగాలను సూకీపై మోపింది. వీటన్నింటిలోనూ ఆమెను దోషిగా తేల్చిన న్యాయస్థానం 23 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. తాజాగా, లంచం కేసులో మూడేళ్ల జైలు శిక్ష పడింది. అంటే మొత్తం 26 ఏళ్లపాటు సూకీ జైలు జీవితం గడపాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె వయసు 77 సంవత్సరాలు. సూకీ 1989 నుంచి 2010 మధ్య 15 ఏళ్లపాటు గృహ నిర్బంధంలో ఉన్నారు. మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఆమెకు 1991లో నోబెల్ శాంతి బహుమతి లభించింది.
Myanmar
Aung San Suu Kyi
Corruption
Maung Weik

More Telugu News