Jowar: జొన్న చేసే మేలు చాలానే..
- ఇందులో ఫైబర్ ఎక్కువ
- నిదానంగా జీర్ణమవుతుంది
- దీంతో నియంత్రణలో బ్లడ్ గ్లూకోజ్
- ఐరన్, ప్రొటీన్ ఇతర పోషకాలు
ప్రపంచం మళ్లీ పాత రోజులను గుర్తు చేసుకుంటోంది. గత తాలూకూ గొప్ప ఆహారాలను మళ్లీ అలవాటు చేసుకుంటోంది. మన తాతల కాలంలో జొన్న, రాగులు, కొర్రలు, సజ్జలు ప్రధాన ఆహారంగా ఉండేవి. కాలక్రమంలో వీటి స్థానంలో బియ్యం, గోధుమ ప్రధాన ఆహారంగా మారిపోయాయి. నేటి జీవన విధానానికి అనుకూలంగా లేని వీటి కారణంగా వచ్చే అనర్థాలపై అవగాహన పెరుగుతోంది. దీంతో సిరిధాన్యాలు, మిల్లెట్స్ పేరుతో మళ్లీ కొర్రలు, రాగులు, జొన్న తదితర వాటిని తినడాన్ని అలవాటు చేసుకుంటున్నారు. వీటిల్లో జొన్న (జోవర్) వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
గ్లూటెన్ ఉండదు..
గ్లూటెన్ అన్నది ఓ ప్రొటీన్. గోధుమ, బార్లీ జాతి ధాన్యాల్లో ఉంటుంది. గ్లూటెన్ జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. కడుపు ఉబ్బరం, కడుపులో నొప్పి వస్తాయి. కానీ, జొన్నలో గ్లూటెన్ ఉండదు. గ్లూటెన్ పడని వారికి ఇదొక మంచి ప్రత్యామ్నాయం.
ఫైబర్
రైస్, బార్లీతో పోలిస్తే జొన్నలో ఫైబర్ ఎక్కువ. ఒక్కసారి తినే జొన్న ఆహారంతో 12 గ్రాముల ఫైబర్ శరీరానికి అందుతుంది. మన రోజువారీ ఫైబర్ అవసరాల్లో ఇది సగం. ఫైబర్ అధికంగా ఉన్న వాటిని తీసుకోవడం వల్ల స్థూలకాయం, స్ట్రోక్, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, మధుమేహం, జీర్ణాశయ సమస్యల రిస్క్ తగ్గుతుంది.
రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ
జొన్నలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగానే ఉంటాయి. కాకపోతే అవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. దీంతో తీసుకున్న ఆహారం నిదానంగా జీర్ణమవుతుంది. దాంతో కార్బోహైడ్రేట్లు కూడా నిదానంగానే రక్తంలోకి చేరతాయి. రైస్ మాదిరిగా ఒకేసారి చేరడం ఉండదు. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుంది.
ప్రొటీన్
100 గ్రాముల జొన్న ఆహారంలో 11 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. కణాలకు శక్తి ఇవ్వడానికి, కండరాల బలోపేతానికి ప్రొటీన్ అవసరం.
ఐరన్
ప్రతి కప్పు జొన్నలో 8.45 గ్రాముల ఐరన్ ఉంటుంది. దీనికితోడు విటమిన్ సీ కూడా ఉండడంతో ఐరన్ ను మన శరీరం పూర్తిగా తీసుకుంటుంది.
ఎముకలు
జొన్నలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. దీంతో మన శరీరానికి క్యాల్షియం ఎక్కువగా అందుతుంది. మెగ్నీషియం అన్నది క్యాల్షియం సంగ్రహణను పెంచుతుంది.
విటమిన్స్, మినరల్స్
జొన్నలో విటమిన్స్, జింక్, కాపర్, 20 మైక్రో న్యూట్రియంట్లు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా లభిస్తాయి.
బరువు తగ్గొచ్చు
జొన్నలో ఫైబర్ ఉండడం వల్ల కొంచెం తీసుకున్నా కడుపు నిండినట్టు అనిపిస్తుంది. నిదానంగా జీర్ణం అవుతుంది కనుక రోజు మొత్తం మీద తీసుకునే ఆహార పరిమాణం తగ్గుతుంది. ఇది బరువు తగ్గడానికి సాయపడుతుంది.
గుండెకు మంచిది
ఫైబర్ తగినంత ఉండడం వల్ల ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ (చెడు కొలెస్ట్రాల్) తగ్గేందుకు సాయపడుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ రిస్క్ కూడా తగ్గుముఖం పడుతుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు మేలు చేస్తాయి.