TRS: కోడితో పాటు మద్యం పంచిన టీఆర్ఎస్ నేతకు ఈసీ నోటీసులు
- దసరా రోజున పేదలకు కోడి, మద్యం పంపిణీ చేసిన శ్రీహరి
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
- ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
- వివరాలు తెలపాలంటూ వరంగల్ కలెక్టర్‌కు ఈసీ ఆదేశం
- ఈసీ తరఫున శ్రీహరికి నోటీసులు అందజేసిన కలెక్టర్
టీఆర్ఎస్ పార్టీని జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశపెడుతూ పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన సందర్భంగా... సరిగ్గా దసరా పర్వదినాన వరంగల్‌కు చెందిన ఆ పార్టీ నేత రాజనాల శ్రీహరి పేదలకు కోడితో పాటు క్వార్టర్ మద్యం బాటిల్ పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. నగరంలో బహిరంగంగా జరిగిన ఈ పంపిణీకి సంబంధించిన వీడియో నాడు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది.
రాజనాల శ్రీహరి బహిరంగంగా మద్యం పంపిణీ చేసిన వ్యవహారంపై బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును ఆధారం చేసుకుని ఎన్నికల సంఘం గురువారం వరంగల్ జిల్లా కలెక్టర్‌ను వివరణ కోరింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు అందజేయాలంటూ కలెక్టర్‌కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను ఆధారం చేసుకుని జిల్లా కలెక్టర్.. రాజనాల శ్రీహరికి నోటీసులు జారీ చేశారు. ఓటర్లకు కోడితో పాటు మద్యం పంపిణీని ఎందుకు చేపట్టారని సదరు నోటీసుల్లో శ్రీహరిని కలెక్టర్ వివరణ కోరారు.