Telangana: మునుగోడు ఉప ఎన్నికల పోరు నుంచి తప్పుకున్న టీడీపీ
- రేపటితో మునుగోడులో నామినేషన్లకు తెర
- గురువారం టీడీపీ అభ్యర్థిని చంద్రబాబు ప్రకటిస్తారని ప్రచారం
- పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించామన్న బక్కని
- అందరి అభిప్రాయాల మేరకే నిర్ణయం తీసుకున్నామన్న టీ టీడీపీ అధ్యక్షుడు
తెలంగాణలో ఆసక్తి రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) గురువారం కీలక ప్రకటన చేసింది. మునుగోడు ఉప ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆ పార్టీ తెలంగాణ శాఖ (టీ టీడీపీ) నిర్ణయించింది. ఈ మేరకు టీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు గురువారం అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయడం కంటే కూడా నియోజకవర్గంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపైనే దృష్టి సారించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పుకొచ్చారు.
మునుగోడు ఉప ఎన్నికలో శుక్రవారంతో నామినేషన్లకు గడువు ముగియనుంది. ఈ క్రమంలో మునుగోడులో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న ఆ పార్టీ నేత జక్కలి ఐలయ్య యాదవ్ పేరును పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గురువారం ప్రకటిస్తారన్న వార్తలు వినిపించాయి. అయితే ఆ ప్రకటనకు విరుద్ధంగా ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదన్న బక్కని నర్సింహులు ప్రకటన వచ్చింది. పార్టీకి చెందిన కీలక నేతలు, మునుగోడుకు చెందిన క్షేత్ర స్థాయి నేతలతో చర్చించిన మీదటే పోటీకి దూరంగా ఉండాలంటూ నిర్ణయం తీసుకున్నామని బక్కని తన ప్రకటనలో వెల్లడించారు.