Munugode: టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకుంటా: కేటీఆర్
- చండూరులో నామినేషన్ వేసిన ప్రభాకర్ రెడ్డి
- నామినేషన్ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్
- నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజగోపాల్ రెడ్డి ఏం చేశారని ప్రశ్న
- రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు తీసుకుని రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని ఆరోపణ
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గురువారం చండూరులో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికను అవసరం లేకపోయినా బలవంతంగా రుద్దిన ఎన్నికగా అభివర్ణించారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే తాను మునుగోడును దత్తత తీసుకుంటానని కేటీఆర్ అన్నారు. నియోజకవర్గ అభివృద్దిలో సంపూర్ణ బాధ్యత తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరుపై కేటీఆర్ ధ్వజమెత్తారు. గడచిన నాలుగేళ్లలో రాజగోపాల్ రెడ్డి ఒక్క అభివృద్ధి పని అయినా చేశారా? అని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కనీసం ఒక్క సారైనా ఏ ఒక్క మంత్రినైనా కలిశారా? అని నిలదీశారు. పదేళ్ల క్రితం మునుగోడు ఇప్పుడెలా ఉందో చూడండని ఆయన ఓటర్లను కోరారు. గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా రూ.5లక్షల పరిహారం ఇస్తున్న ఏకైక నాయకుడు కేసీఆరేనన్నారు. నల్లగొండ జిల్లాను ఫ్లోరైడ్ భూతం నుంచి కాపాడింది కూడా కేసీఆరేనన్నారు. ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం నల్లగొండ జిల్లాకు రూ.19 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి నీతి ఆయోగ్ సూచిస్తే... రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు తీసుకుని రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని ఆయన విమర్శించారు.