Team India: ప్రాక్టీసు మ్యాచ్ లో ఆసీస్ దేశవాళీ జట్టు చేతిలో ఓడిపోయిన టీమిండియా
- ఆస్ట్రేలియా వేదికగా వరల్డ్ కప్
- నేడు సన్నాహక మ్యాచ్ ఆడిన టీమిండియా
- 36 పరుగుల తేడాతో గెలిచిన పశ్చిమ ఆస్ట్రేలియా జట్టు
టీ20 వరల్డ్ కప్ కు సన్నద్ధమయ్యేందుకు టీమిండియా కాస్త ముందుగానే ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ప్రాక్టీసు మ్యాచ్ లో టీమిండియాకు పరాజయం ఎదురైంది. దేశవాళీ జట్టు వెస్ట్రన్ ఆస్ట్రేలియా టీమ్ తో నేడు జరిగిన వార్మప్ మ్యాచ్ లో భారత్ 36 పరుగుల తేడాతో ఓడిపోయింది.
పెర్త్ లో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 168 పరుగులు చేసింది. నిక్ హాబ్సన్ (64), డార్సీ షార్ట్ (52) అర్ధ సెంచరీలతో రాణించారు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 3, హర్షల్ పటేల్ 2, అర్షదీప్ సింగ్ 1 వికెట్ తీశారు.
అనంతరం, లక్ష్యఛేదనలో టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. భారత ఇన్నింగ్స్ లో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఒక్కడే రాణించాడు. రాహుల్ 55 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్ లతో 74 పరుగులు చేశాడు.
హార్దిక్ పాండ్యా (17), దినేశ్ కార్తీక్ (10), పంత్ (9), దీపక్ హుడా (6) భారీ స్కోర్లు సాధించలేకపోవడం భారత్ ఓటమికి దారితీసింది. వెస్ట్రన్ ఆస్ట్రేలియా బౌలర్లలో మాథ్యూ కెల్లీ 2, లాన్స్ మోరిస్ 2, హామిష్ మెకెంజీ 2, జాసన్ బెరెండార్ఫ్ 1, ఆండ్రూ టై 1 వికెట్ పడగొట్టారు.