Himachal Pradesh: ఒకే విడతలో హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ ఇదిగో
- ఈ నెల 17న హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్
- నవంబర్ 12న పోలింగ్
- డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు
- షెడ్యూల్‌ను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఉత్తరాది రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్... ఎన్నికల సంఘం కమిషనర్ అనూప్ చంద్ర పాండేతో కలిసి ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు.
ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఒకే విడతలో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కానున్నాయి. రాష్ట్రంలో మొత్తం 68 స్థానాలు ఉండగా... వాటికి నవంబర్ 12న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపును డిసెంబర్ 8న చేపట్టి అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు. ఈ ఎన్నికలకు ఈ నెల 17న నోటిఫికేషన్ వెలువడనుండగా...అదే రోజు నుంచి నామినేషన్ల దాఖలకు అవకాశం కల్పిస్తారు. ఈ నెల 25తో నామినేషన్లకు గడువు ముగియనుండగా... 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.