Telangana: చివరి రోజు నామినేషన్ వేసిన పాల్వాయి స్రవంతి... గద్దర్ తప్పుకోవడంతో బరిలోకి దిగిన కేఏ పాల్
- ముగిసిన మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల గడువు
- పాల్వాయి స్రవంతి నామినేషన్‌కు భారీగా హాజరైన కాంగ్రెస్ నేతలు
- చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్న గద్దర్
- గద్దర్ బదులుగా ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కేఏ పాల్
మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. అయితే గడువు ముగిసే సమయానికి నామినేషన్లతో చండూరులోని రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముందు భారీగా అభ్యర్థులు క్యూ లైన్‌లో నిలుచున్నారు. దీంతో గడువు ముగిసే సమయానికి క్యూ లైన్‌లో ఉన్న వారి నామినేషన్లు స్వీకరించాలని అధికారులు నిర్ణయించారు.
ఇదిలా ఉంటే.. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మరోవైపు ప్రజాశాంతి పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున మునుగోడు బరిలో దిగేందుకు సిద్ధపడ్డ ప్రజా గాయకుడు గద్దర్ చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. మునుగోడు బరిలోకి దిగేందుకు గద్దర్ నిరాకరించడంతో ప్రజాశాంతి పార్టీ తరఫున ఆ పార్టీ అధినేత కేఏ పాల్ స్వయంగా నామినేషన్ దాఖలు చేశారు.