Telangana: 'అక్బరుద్దీన్ ఓవైసీకి క్లీన్ చిట్'ను సవాల్ చేస్తూ పిటిషన్... తెలంగాణ సర్కారు, పోలీసులకు హైకోర్టు నోటీసులు
- నిజామాబాద్‌లో విద్వేష వ్యాఖ్యలు చేశారంటూ అక్బరుద్దీన్‌పై కేసు
- ఇటీవలే ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చిన నాంపల్లి కోర్టు
- నాంపల్లి కోర్టు తీర్పును కొట్టేయాలంటూ హైకోర్టులో కరుణ సాగర్ పిటిషన్
- తదుపరి విచారణను డిసెంబర్ 30కి వాయిదా వేసిన కోర్టు
మజ్లిస్ పార్టీ కీలక నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి విద్వేష వ్యాఖ్యల కేసులో క్లీన్ చిట్ ఇచ్చిన నాంపల్లి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను న్యాయవాది కరుణ సాగర్ దాఖలు చేశారు. అక్బరుద్దీన్‌కు క్లీన్ చిట్ ఇస్తూ నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలంటూ కరుణ సాగర్ తన పిటిషన్లో హైకోర్టును కోరారు.
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు శుక్రవారం దీనిపై విచారణ చేపట్టింది. పిటిషనర్ వాదనలు విన్న హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ పోలీసు శాఖకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 30కి వాయిదా వేసింది. గతంలో నిజామాబాద్‌లో మజ్లిస్ పార్టీ సమావేశానికి హాజరైన సందర్భంగా విద్వేష వ్యాఖ్యలు చేశారంటూ అక్బరుద్దీన్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుపై ఏళ్ల తరబడి విచారణ జరగగా... అక్బరుద్దీన్‌కు క్లీన్ చిట్ ఇస్తూ ఇటీవలే నాంపల్లి కోర్టు తీర్పు చెప్పింది.