BCCI: వచ్చే ఏడాది వరల్డ్ కప్ కు కేంద్రం పన్ను మినహాయింపు ఇవ్వకపోతే బీసీసీఐ ఎంత నష్టపోతుందో తెలుసా...?
- 2023లో భారత్ లో 50 ఓవర్ల వరల్డ్ కప్
- అక్టోబరు-నవంబరులో టోర్నమెంట్
- టోర్నీ ఆదాయంపై 21.84 శాతం సర్ చార్జి విధింపు
- పన్ను మినహాయింపు కోసం బోర్డు ప్రయత్నాలు!
భారత్ లో వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ జరగనుంది. 2023 అక్టోబరు-నవంబరు మాసాల్లో ఈ మెగా టోర్నీని నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐసీసీ షెడ్యూల్ ఖరారైంది. సాధారణంగా వరల్డ్ కప్ వంటి భారీ ఈవెంట్లతో ఆతిథ్య దేశం క్రికెట్ బోర్డు ఎంతో లాభపడుతుంది. కానీ, బీసీసీఐకి ఆ పరిస్థితి కనిపించడంలేదు. అందుకు కారణం భారత కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పన్నుల విధానమే.
ఐసీసీ టోర్నీ ప్రసార ఆదాయంపై 21.84 శాతం పన్ను సర్ చార్జి విధిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేంద్రం కట్టుబడి ఉంటే, బీసీసీఐకి దాదాపు రూ.955 కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనా. ఇప్పటికే ఉన్న పన్నులకు అదనంగా సర్ చార్జి తోడవడంతో బీసీసీఐకి వచ్చే ఏడాది నిర్వహించే వరల్డ్ కప్ ఏమంత లాభదాయకంగా కనిపించడంలేదు.
ఐసీసీ ఏదైనా దేశంలో మెగా టోర్నీ నిర్వహించాలంటే, అక్కడి క్రికెట్ బోర్డు తమ ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు పొందాల్సి ఉంటుంది. కానీ భారత్ లో పన్నుల వ్యవస్థలు ఇలాంటి మినహాయింపులకు అనుమతించవు. ఈ కారణంగానే, 2016లో నిర్వహించిన టీ20 వరల్డ్ కప్ ద్వారా బీసీసీఐ రూ.193 కోట్ల మేర నష్టపోయింది. ఐసీసీ ట్రైబ్యునల్ లో దీనికి సంబంధించిన కేసు ఇప్పటికీ నడుస్తోంది.
ఈ నేపథ్యంలో, పన్ను మినహాయింపు కోసం బీసీసీఐ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కనీసం సర్ చార్జిని 21.84 శాతం నుంచి 10.92 శాతానికి తగ్గించాలని బీసీసీఐ కేంద్రం ఆర్థికమంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతోంది. తద్వారా బీసీసీఐకి వాటిల్లే నష్టం సగానికి పైగా తగ్గుతుంది.