Archana Nag: ప్రముఖులను బెదిరింపులకు గురిచేస్తూ కోట్లకు పడగలెత్తిన యువతి... వివరాలు ఇవిగో!
- ఒడిశాలో బట్టబయలైన బ్లాక్ మెయిలింగ్ దందా
- ప్రముఖుల వద్దకు అమ్మాయిల సరఫరా
- ఆపై, ఫొటోలతో బ్లాక్ మెయిలింగ్
- నాలుగేళ్లలో రూ.30 కోట్లు సంపాదించిన వైనం
- అరెస్ట్ చేసిన పోలీసులు
ఇటీవల ఒడిశాకు చెందిన ఓ యువతి కొన్ని అభ్యంతరకర ఫొటోలతో ప్రముఖులను బ్లాక్ మెయిల్ చేస్తూ వారి నుంచి డబ్బు గుంజుతున్న వైనం బట్టబయలైంది. అర్చనా నాగ్ అనే 26 ఏళ్ల యువతి కొద్దికాలంలోనే కోటీశ్వరురాలైన వైనం విస్తుగొలుపుతోంది. సంపన్నులను గుర్తించి, వారితో పరిచయం పెంచుకోవడం, అభ్యంతరకర ఫొటోలతో బెదిరింపులకు పాల్పడడం అర్చనా నాగ్ దందా. అత్యంత విలాసవంతమైన బంగ్లా, లగ్జరీ కార్లు, కళ్లు చెదిరేలా ఇంటి లోపలి అలంకరణలు, ఖరీదైన మేలుజాతి శునకాలు... ఇదీ ప్రస్తుతం అర్చన లైఫ్ స్టయిల్.
పోలీసుల విచారణలో అర్చనా నాగ్ గురించి ఆసక్తికర వివరాలు తెలిశాయి. ఆమె స్వస్థలం కలహండి జిల్లాలోని లాంజీగఢ్. కలహండి జిల్లా అంటే కరవు ప్రాంతంగా పేరుపొందింది. అర్చనా కూడా పేద కుటుంబం నుంచే వచ్చింది. అయితే, కొన్నాళ్ల కిందట తల్లితో కలిసి కేసింగా ప్రాంతానికి వచ్చింది. అక్కడ అర్చన తల్లి కార్మికురాలిగా పనిచేసింది. ఆపై, 2015లో అర్చన భువనేశ్వర్ చేరుకుంది.
ఓ మొదట్లో ఓ సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేసిన అర్చన, ఆపై బ్యూటీ పార్లర్ లో చేరింది. అక్కడే ఆమెకు జగబంధు చంద్ పరిచయం అయ్యాడు. అతడిది బాలాసోర్ జిల్లా. 2018లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
కాగా, బ్యూటీ పార్లర్ లో పనిచేస్తున్నప్పుడే అర్చనా నాగ్ ఓ వ్యభిచార రాకెట్ నడిపించేదని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఆమె భర్త జగబంధు ఓ సెకండ్ హ్యాండ్ కార్ల షోరూం నిర్వహించేవాడు. అతడు కూడా భార్యకు తగిన భర్తే. బాగా డబ్బున్న రాజకీయనేతలు, బిల్డర్లు, వ్యాపారవేత్తలతో పరిచయాలు పెంచుకునేవాడు. ఆ విధంగా భార్యకు సహకరించేవాడు.
అటు, అర్చన కూడా సంపన్నులను, ప్రముఖులను పరిచయం చేసుకుని వారితో సన్నిహితంగా మెలిగేది. అంతేకాదు, వారికి తోడుగా అమ్మాయిలను కూడా పంపించేది. వారు అమ్మాయిలతో ఉన్న ఫొటోలను తీసి, ఆ ఫొటోల సాయంతో డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసేది. అర్చన బాధితుల్లో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలతో ఆమె కలిసున్న ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో సంచలనం రేగింది.
నయాపల్లి పోలీస్ స్టేషన్ లో ఓ సినీ నిర్మాత చేసిన ఫిర్యాదుతో అర్చనా బ్లాక్ మెయిలింగ్ భాగోతం వెలుగులోకి వచ్చింది. ఇతర అమ్మాయిలతో తాను కలిసి ఉన్నప్పటి ఫొటోలతో తనను అర్చన బెదిరిస్తోందని, రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందని ఆ నిర్మాత పోలీసులకు తెలిపాడు. మరో అమ్మాయి ముందుకొచ్చి, వ్యభిచారం పేరిట అర్చన తనను ఒత్తిడి చేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు అర్చనను అరెస్ట్ చేశారు.
కాగా, అర్చన అక్రమాలకు ఆమె భర్త జగబంధు పూర్తి సహకారం అందించేవాడని తెలిసింది. పోలీసులు విచారణ జరపగా, కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే ఈ దంపతులు రూ.30 కోట్ల మేర సంపాదించినట్టు వెల్లడైంది.
ఇక, అర్చన వ్యవహారం రాజకీయ రంగు కూడా పులుముకుంది. అర్చనతో అధికార బీజేడీ మంత్రులు, ఎమ్మెల్యేలకు లింకులు ఉన్నాయని, వారి భాగోతాలు బయటికి వస్తే 22 ఏళ్లుగా కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని విపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఎస్ఎస్ సలూజా పేర్కొన్నారు. అర్చన వ్యవహారం నుంచి బీజేడీ నేతలను కాపాడేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని కూడా ఆరోపించారు.
బీజేపీ భువనేశ్వర్ విభాగం అధ్యక్షుడు బాబు సింగ్ స్పందిస్తూ, 18 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు సహా 25 మంది నేతలు ఈ దందాలో ఉన్నారని ఆరోపించారు. దీనిపై బీజేడీ స్పందిస్తూ, తమ నేతలపై వస్తున్న ఆరోపణలను ఖండించింది. తగిన ఆధారాలు చూపాలని విపక్ష నేతలకు స్పష్టం చేసింది.