Kannababu: అక్కడ చంద్రబాబు ఏదో మహానగరాన్ని నిర్మిస్తే, దాన్ని మేం కూల్చేస్తున్నట్టు భ్రమింపజేస్తున్నారు: మాజీ మంత్రి కన్నబాబు
- అమరావతి అంశంలో కన్నబాబు వ్యాఖ్యలు
- 29 గ్రామాల్లో అమరావతి లేదని వెల్లడి
- ఎల్లో మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
అమరావతి అంశంపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కురసాల కన్నబాబు స్పందించారు. అమరావతి అనేది ఒక బ్రహ్మ పదార్థం అని అభివర్ణించారు. అమరావతి అన్న పేరే తప్ప, ఆ 29 గ్రామాల్లో అమరావతి ఉందా? అని ప్రశ్నించారు. అటు విజయవాడలో కానీ, ఇటు గుంటూరులో కానీ అమరావతి లేదని అన్నారు.
తాము అధికారంలోకి వచ్చాక నాలుగు తాత్కాలిక భవనాలే తప్ప, 29 గ్రామాల్లో కనీస మౌలిక వసతులు కూడా కనిపించలేదని తెలిపారు. ఆ తాత్కాలిక భవనాలకు చదరపు అడుగుకు రూ.12 వేలు చొప్పున టీడీపీ ప్రభుత్వం చెల్లించిందని, గ్రాఫిక్స్, కన్సల్టెన్సీలకు వందల కోట్లు చెల్లించారని కన్నబాబు ఆరోపించారు. ఇంతకుమించి టీడీపీ చేసింది ఏమైనా ఉందా? అని నిలదీశారు.
అక్కడేదో చంద్రబాబు మహానగరాన్ని నిర్మిస్తే, తాము దాన్ని డైనమైట్లతో కూల్చేస్తున్నట్టుగా బయటి రాష్ట్రాల వారిని భ్రమింపజేస్తున్నారని విమర్శించారు. అమరావతి లేకపోతే భూమి బద్దలైపోతుందన్నట్టుగా ఎల్లో మీడియాలో రాతలు ఉన్నాయని కన్నబాబు అసహనం వ్యక్తం చేశారు.