Nayanthara: నయనతార దంపతులు చేసింది సరైనదా, కాదా? అన్నది తేలుస్తాం: విచారణ కమిటీ హెడ్
- వివాదాన్ని తొలగించాల్సిన బాధ్యత తమపై ఉందన్న విశ్వనాథన్
- ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని వివరణ
- సుమోటోగానే దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడి
పెళ్లయిన నాలుగు నెలలకే నయనతార, విఘ్నేశ్ దంపతులు వేరొక మహిళ గర్భం ద్వారా తల్లిదండ్రులు కావడంపై పెద్ద ఎత్తున దుమారం లేవడం తెలిసిందే. దీనిపై సుమోటోగా దర్యాప్తు చేస్తున్నట్టు తమిళనాడు రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ రూరల్ హెల్త్ సర్వీసెస్ జాయింట్ డైరెక్టర్ ఎ. విశ్వనాథన్ తెలిపారు. నయనతార-విఘ్నేశ్ శివన్ సరోగసీ విషయంలో చట్ట ప్రకారం నడుచుకున్నారా? అన్నది పరిశీలిస్తామని చెప్పారు. ఈ విషయంలో విచారణకు తమిళనాడు సర్కారు ఏర్పాటు చేసిన కమిటీకి విశ్వనాథన్ అధ్యక్షత వహిస్తున్నారు.
ఈ అంశంలో తమకు ఒక్క ఫిర్యాదు కూడా అందలేదన్నారు. కాకపోతే దీనిపై నెలకొన్న వివాదాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. తమిళనాడులో అనుసరిస్తున్న మెరుగైన విధానాల పట్ల నమ్మకాన్ని వ్యక్తం చేయడమన్నారు. ‘‘ముందు హాస్పిటల్ లోని అన్ని రికార్డులు పరిశీలించాలి. అన్ని ప్రక్రియలు అనుసరించారా? లేదా? అన్నది చూడాలి’’ అని చెప్పారు.
నిజానికీ సరోగసీ విషయంలో నిబంధనలను కేంద్ర సర్కారు సవరించింది. వాణిజ్య ప్రయోజనాలతో సరోగసీకి అనుమతి లేదు. పరోపకార (నిస్వార్థ) సరోగసీకే అనుమతి ఉంది. అంటే గర్భంలో శిశువును మోసి కనిపెట్టడం అన్నది డబ్బుల కోసం చేయకూడదు. అందుకోసం సదరు మహిళకు ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు అందించకూడదు. ఈ ఏడాది జనవరి 25 నుంచి నూతన నిబంధనలు అమల్లోకి వచ్చాయి.