Andhra Pradesh: అవినీతి సొమ్ముతో వాహనం కొన్న గన్‌మన్... సస్పెండ్ చేసిన కడప జిల్లా ఎస్పీ
- ఉన్నతాధికారుల అనుమతి లేకుండా వాహనం కొన్న పుష్పరాజ్
- సమాచారం అందడంతో విచారణకు ఆదేశించిన కడప జిల్లా ఎస్పీ
- పుష్పరాజ్ సర్వీస్ రూల్స్ అతిక్రమించారని నిర్ధారణ
- సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఎస్పీ అన్బురాజన్
పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా వాహనం కొన్న కారణంగా కడప జిల్లా ఏఆర్ విభాగంలో గన్‌మన్‌గా పనిచేస్తున్న పుష్పరాజ్‌ను సస్పెండ్ చేస్తూ కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పుష్పరాజ్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ అన్బురాజన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
డ్యూటీలో ఉన్న పోలీసులు వాహనం కొనుగోలు చేస్తే... దానిపై ముందుగానే పోలీసు ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. అయితే అలా పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే పుష్పరాజ్ ఇటీవలే ఓ వాహనం కొనుగోలు చేశారు. దీనిపై సమాచారం అందుకున్న అన్బురాజన్ ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు. అవినీతి సొమ్ముతోనే పుష్పరాజ్ వాహనం కొన్నట్లు విచారణలో తేలింది. దీంతో పుష్పరాజ్ సర్వీస్ రూల్స్‌ను అతిక్రమించారని నిర్ధారించిన ఎస్పీ... పుష్పరాజ్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు.