T20 World Cup: నేటి నుంచి టీ20 ప్రపంచకప్.. అత్యధిక పరుగుల వీరులు వీరే!
- నేటి నుంచి టీ20 ప్రపంచకప్
- ఆరంభ ప్రపంచకప్‌ను గెలుచుకున్న ధోనీ సారథ్యంలోని భారత జట్టు
- ఆ తర్వాత అందని ద్రాక్షగా టీ20 ప్రపంచకప్
- తొలి ఎడిషన్‌లో 265 పరుగులతో హేడెన్ టాప్ స్కోరర్
- గత ఎడిషన్‌లో అదరగొట్టిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం
ఆస్ట్రేలియాలో నేటి నుంచి ఎనిమిదో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. 2007లో జరిగిన తొలి ప్రపంచకప్‌ను మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలో భారత జట్టు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. తొలి ప్రపంచకప్‌లో ఆడిన రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్, షకీబల్ హసన్, షాన్ విలియమ్స్ తదితరులు ఈ టోర్నీలోనూ బరిలోకి దిగుతుండడం అరుదైన సన్నివేశం. 2007 తర్వాత భారత జట్టుకు మళ్లీ ప్రపంచకప్ అందకుండా పోయింది. కాగా, నేడు ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన వీరులెవరో చూద్దాం.
* 2007 టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ మాథ్యూ హేడెన్ అదరగొట్టాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ టోర్నీలో హేడెన్ ఆరు మ్యాచుల్లో 265 పరుగులు చేశాడు.
* 2009 టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక ఓపెనింగ్ బ్యాటర్ తిలక్‌రత్నే దిల్షాన్ ఏడు మ్యాచుల్లో 52.83 సగటుతో 317 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలున్నాయి.
* శ్రీలంక బ్యాటర్ మహేల జయవర్థనె టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అరుదైన రికార్డు సృష్టించాడు. 2007-2014 మధ్య 31 మ్యాచుల్లో 1,016 పరుగులు చేశాడు. ప్రపంచకప్ చరిత్రలో ఓ ఆటగాడు సాధించిన అత్యధిక పరుగులు ఇవే. 2010 ప్రపంచకప్‌లో ఆరు మ్యాచుల్లో 302 పరుగులు చేశాడు.
* 2012 శ్రీలంకలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియన్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ షేన్ వాట్సన్ అత్యధిక పరుగులు సాధించాడు. ఆరు మ్యాచుల్లో 49.80 సగటుతో 249 పరుగులు చేశాడు.
* 2014 ప్రపంచకప్‌లో టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు సాధించాడు. ఆరు మ్యాచుల్లో 106.33 సగటు 129.14 స్ట్రైక్ రేట్‌తో 319 పరుగులు సాధించాడు.
* 2016 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ఆరు మ్యాచుల్లో 295 పరుగులు చేశాడు.
* 2021లో ఎడిషన్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఆరు మ్యాచుల్లో 303 పరుగులు చేశాడు.