Janasena: "ఒక్క వ్యక్తి" వీటన్నింటి మీద నిర్ణయం తీసుకున్నాడు..కానీ డిసెంట్రలైజేషన్ గురించి మాట్లాడుతున్నారు: పవన్ కల్యాణ్
- విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడిన పవన్
- పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేనాని
- రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలనేదే తమ నిర్ణయమని వెల్లడి
- రాజు మారినప్పుడల్లా రాజధాని మారుస్తామంటే ఎలా? అని ప్రశ్న
- సీమ నుంచి అంత మంది సీఎంలు వచ్చినా ఆ ప్రాంతం వెనుకబడి ఉందేమిటని నిలదీత
ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన కోసం శనివారమే విశాఖ చేరుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆదివారం ఉదయం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ సర్కారు తీరుపై నిప్పులు చెరిగారు. వైసీపీ చెబుతున్న అధికార వికేంద్రీకరణను ప్రధానంగా ప్రస్తావించిన పవన్.. అసలు వైసీపీలో అధికార వికేంద్రీకరణ ఉందా? అని ఆయన ప్రశ్నించారు. అధికారం చెలాయించడంలో అధికార కేంద్రీకరణను అవలంబిస్తున్న వైసీపీ.. విపక్షాలను తిట్టించడానికి మాత్రమే అధికార వికేంద్రీకరణను ఆశ్రయించిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంలోని 40కి పైగా శాఖలు, 28 మంది మంత్రులు, ఐదుగురు డిప్యూటీ సీఎంలకు సంబంధించిన నిర్ణయాలన్నింటినీ ఒక్క వ్యక్తే తీసుకుంటున్నారని ఆరోపించిన పవన్... అధికార వికేంద్రీకరణపై ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారాన్ని సెంట్రలైజేషన్ చేసేసిన వ్యక్తి డీసెంట్రలైజేషన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని పవన్ ఆరోపించారు.
విశాఖ పర్యటనకు వచ్చింది జనవాణి కార్యక్రమం కోసమేనన్న పవన్ కల్యాణ్... అసలు 3 రాజధానులు తమ అజెండాలోనే లేదని తెలిపారు. అసలు తమ కార్యక్రమాన్ని 4 నెలల క్రితమే నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు. విశాఖ గర్జనకు ముందే విమాన టికెట్లు బుక్ చేసుకున్నామన్నారు. అయినా తమ పార్టీ కార్యక్రమాలతో వైసీపీకి ఏం సంబంధం ఉందని ఆయన ప్రశ్నించారు. జనసేన కార్యక్రమాలపై వైసీపీకి ఎందుకు సమాధానం చెబుతామన్నారు. ప్రజా సమస్యలను వినడమే జనవాణి ముఖ్య ఉద్దేశమన్నారు. పోలీసుల అనుమతితోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తే ప్రజలు మా వద్దకు ఎందుకు వస్తారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ పార్టీలతో పోటీ పెట్టుకుంటామన్నారు.
జనసేనపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పోలీసు కానిస్టేబుల్ కుటుంబం నుంచి వచ్చిన తనకు పోలీసు శాఖపై అమితమైన గౌరవం ఉందని పవన్ చెప్పారు. ఈ కారణంగానే పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా పెద్దగా పట్టించుకోలేదన్నారు. మాపై జులుం ప్రదర్శిస్తున్న పోలీసులు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఎందుకు పరిష్కరించలేకపోయారని పవన్ ప్రశ్నించారు. పోలీసు శాఖకు గౌరవం ఇవ్వని వ్యక్తి కింద ఇప్పుడు పోలీసులు పనిచేస్తున్నారన్నారు. గంజాయి సాగుదారులను వదలండి... సామాన్యుల గొంతు వినిపించడానికి వచ్చిన జనసేనను ఇబ్బంది పెట్టండని ఆయన పోలీసులను ఉద్దేశించి అన్నారు. దోపిడీదారులను వదలండి... ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే వారిని మాత్రం అరెస్ట్ చేయండి అని కూడా ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
రాష్ట్రానికి రాజధాని ఒక్కటి మాత్రమే ఉండాలనేది జనసేన అభిమతమని పవన్ అన్నారు. అది అమరావతి అయినా, కర్నూలు అయినా, విశాఖ అయినా తమకు ఇబ్బంది లేదన్నారు. ఏ నగరాన్ని రాజధానిగా ప్రకటించినా తమకేమీ ఇబ్బంది లేదని చెప్పామని పవన్ వివరించారు. రాజధానిని ఒక్కసారే నిర్ణయిస్తారని, రాజు మారినప్పుడల్లా రాజధానిని మారుస్తామంటే ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు. రాయలసీమ నుంచి ఇప్పటిదాకా అంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఇంకా ఆ ప్రాంతం ఎందుకు వెనుకబడిందని పవన్ ప్రశ్నించారు. కేవలం విపక్షాలకు చెందిన నేతలపై బూతులు తిట్టించేందుకే అధికార పార్టీ వికేంద్రీకరణ మంత్రాన్ని జపిస్తోందని పవన్ ఆరోపించారు. జనవాణిలో గొడవ చేసేందుకు కూడా కొందరు ప్రయత్నిస్తున్నారని పవన్ ఆరోపించారు.