Janasena: ఈ ఘటనతో మాకు సంబంధంలేదు: పవన్
- శనివారం విశాఖ ఎయిర్ పోర్టు వద్ద మంత్రుల కార్లపై దాడి
- పవన్ రెచ్చగొట్టడం వల్లే దాడి జరిగిందని పోలీసులు నోటీసుల జారీ
- తాను విశాఖ చేరకముందే దాడి జరిగిందన్న పవన్
- దాడితో తమకు ఎంతమాత్రం సంబంధం లేదని వివరణ
విశాఖ ఎయిర్ పోర్టు వద్ద శనివారం ఏపీ మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేశ్, టీటీడీ చైర్మన్ వైవీ సబ్బారెడ్డి కార్లపై జరిగిన దాడి ఘటనపై ఆదివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఘటనతో తమకు ఎంతమాత్రం సంబంధం లేదని పవన్ పేర్కొన్నారు. తాను విశాఖలో అడుగుపెట్టడానికి ముందే ఈ ఘటన జరిగిందని కూడా ఆయన తెలిపారు.
ఇవాళ పవన్ కు పోలీసులు నోటీసులు అందించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, విశాఖ చేరాక తాను రెచ్చగొట్టడం వల్లే గొడవ జరిగినట్లుగా నోటీసుల్లో పేర్కొన్నారని, అందులో వాస్తవం లేదని పవన్ పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు తనకు ఇచ్చిన నోటీసులోనే పవన్ ఈ విషయాలను రాశారు.
ఇదిలా ఉంటే... శనివారం విశాఖ చేరుకున్న తర్వాత ఎయిర్ పోర్టు నుంచి తాను బస చేసిన నోవాటెల్ హోటల్ వరకు పవన్ కల్యాణ్ ర్యాలీగా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీ నిబంధనలకు విరుద్ధమని కూడా విశాఖ పోలీసులు పవన్ కు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు విశాఖ తూర్పు ఏసీపీ హర్షిత చంద్ర జనసేనానికి నోటీసులు అందజేశారు. నగరంలో పోలీస్ 30 యాక్టు అమలులో ఉన్న సమయంలో నిబంధనలు అతిక్రమిస్తూ 500 మందికిపైగా జనంతో ర్యాలీ నిర్వహించారని పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.