CPI Narayana: మూడు రాజధానుల ఉద్యమానికి ప్రభుత్వమే స్పాన్సర్: సీపీఐ నారాయణ
- విజయవాడలో సీపీఐ జాతీయ మహాసభలు
- అమరావతికి గతంలో జగన్ ఆమోదం తెలిపారన్న నారాయణ
- ఇప్పుడు మాట మార్చారని వెల్లడి
- రాజధాని ఏదో ఏపీ ప్రజలు చెప్పలేకపోతున్నారని ఆవేదన
ఏపీ రాజధాని అంశంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. విజయవాడలో జరుగుతున్న సీపీఐ జాతీయ మహాసభల్లో ఆయన మాట్లాడుతూ, ఏపీ రాజధాని అమరావతి అని చంద్రబాబు ప్రకటిస్తే, నాడు జగన్ ఆమోదం తెలిపారని గుర్తుచేశారు. ఇప్పుడు జగన్ మాట మార్చి మడమ తిప్పారని విమర్శించారు.
మీ రాజధాని ఏదంటే చెప్పలేని స్థితిలో ఏపీ ప్రజలు ఉన్నారని నారాయణ వెల్లడించారు. బిడ్డకు మూడేళ్లు వచ్చినా, తల్లి, తండ్రి ఎవరో చెప్పలేని పరిస్థితి అంటూ అభివర్ణించారు. మూడు రాజధానుల ఉద్యమానికి ప్రభుత్వమే స్పాన్సర్ అని వ్యాఖ్యానించారు. విశాఖలో భూ కుంభకోణాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ స్పందిస్తూ, ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని అన్నారు. ప్రతిపక్ష పార్టీలను చూస్తే సీఎం జగన్ కు ఎందుకంత భయం అని ప్రశ్నించారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని విమర్శించారు. వైసీపీ విశాఖ గర్జన పూర్తిగా విఫలమైందని, అందుకే వైసీపీ నేతలు ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నారని రామకృష్ణ పేర్కొన్నారు.