Bharat Jodo Yatra: ‘భారత్ జోడో’ యాత్రపై బీజేపీ యానిమేషన్ వీడియో.. రాహుల్ గాంధీని హాస్యనటుడిగా చిత్రీకరించిన వైనం
- తొలుత పార్టీని ఏకం చేసుకోవడంపై దృష్టి పెట్టాలంటూ బీజేపీ చురకలు
- పలు విషయాలను ప్రస్తావిస్తూ పేరడీ వీడియో రూపొందించిన వైనం
- బీజేపీవి చౌకబారు ట్రోలింగులంటూ ఎదురుదాడికి దిగిన కాంగ్రెస్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ‘భారత్ జోడో’ యాత్రపై బీజేపీ రూపొందించిన యానిమేషన్ వీడియో ఇరు పార్టీల మధ్య అగ్గిరాజేసింది. భారత్ జోడో యాత్రకు బదులుగా తొలుత నేతలను ఏకతాటిపై నడిపించాలని అర్థం వచ్చేలా బీజేపీ ఈ యానిమేషన్ వీడియోను రూపొందించింది. దీనికి కాంగ్రెస్ కూడా తీవ్రంగానే స్పందించింది. బీజేపీవి చౌకబారు ట్రోలింగులని దుయ్యబట్టింది. భారత్ జోడో యాత్రకు వ్యతిరేకంగా బీజేపీ రూపొందించిన ఈ యానిమేషన్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కాంగ్రెస్ ఇటీవల ఎదుర్కొన్న సమస్యలు, గోవాలో ఆ పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి వలస వెళ్లడం, గులాంనబీ ఆజాద్ రాజీనామా, అనంతరం జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ నేతల రాజీనామాలు, రాజస్థాన్ రాజకీయ సంక్షోభం వంటి విషయాలను ప్రస్తావిస్తూ తొలుత కాంగ్రెస్‌ను ఏకం చేయాలని ఆ వీడియోలో బీజేపీ సలహా ఇచ్చింది. వీడియో చివర్లో రాహుల్‌ను సోనియా ఓదారుస్తున్నట్టుగా ఉంది. ఈ వీడియోను బీజేపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
ఈ వీడియోపై కాంగ్రెస్ నేత సుప్రియ ష్రినటే తీవ్రంగా స్పందించారు. భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం చూసి బీజేపీ భయపడుతోందని అన్నారు. బీజేపీ చౌకబారు రాజకీయాలకు పాల్పడుతోందని విరుచుకుపడుతూ పావలా(25 పైసల) ఫొటోను షేర్ చేశారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సమస్యలకు పరిష్కారానికి ఈ స్థాయిలో కృషి చేసి ఉంటే బాగుండేదని చురకలు అంటించారు.