Janasena: చెత్తబుట్టల మూతలను మారణాయుధాలుగా వాడామట: నాదెండ్ల మనోహర్

janasena pac chairmal fires on ap police over pawan kalyan vizag tour

  • మంగళగిరిలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన జనసేన
  • పవన్ విశాఖ రాకముందే వైసీపీ నేతలపై దాడి జరిగిందన్న నాదెండ్ల
  • పోలీస్ యాక్ట్ 30 జనసేనకు మాత్రమే వర్తిస్తుందా? అని ప్రశ్న

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన పేరిట విశాఖకు వచ్చిన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉండని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. రెండు రోజుల పాటు విశాఖలో ఉండి సోమవారం మధ్యాహ్నం పవన్ కల్యాణ్ విజయవాడకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాదెండ్ల పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

విశాఖ ఎయిర్ పోర్టు వద్ద మంత్రులపై జరిగిన దాడిలో జన సైనికులు చెత్త బుట్టలపై ఉన్న మూతలు, చీపుర్లను మారణాయుధాలుగా వినియోగించినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారన్న నాదెండ్ల...ఇంత కంటే హాస్యాస్పదమైన విషయం ఉంటుందా? అని ఎద్దేవా చేశారు. ఈ కారణం చూపి వంద మందికి పైగా జన సైనికులను పోలీసులు అరెస్ట్ చేశారని ఆయన మండిపడ్డారు. పవన్ కల్యాణ్ విశాఖలో అడుగుపెట్టడానికి గంట ముందుగా వైసీపీ నేతలపై దాడి జరిగితే... పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలోనే 500 మంది జనసేన కార్యకర్తలు దాడిలో పాలుపంచుకున్నారని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారని అన్నారు. ఈ అంశాన్ని నోటీసుల్లో నుంచి తొలగించే దిశగా పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చామని ఆయన చెప్పారు. 

విశాఖ నగరంలో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని చెప్పిన పోలీసులు... తాము జనవాణి నిర్వహించేందుకు వీలు లేదని ఆంక్షలు విధించారని నాదెండ్ల అన్నారు. నగరంలో 30 యాక్టు అమలులో ఉంటే వైసీపీ నేతలు విశాఖ గర్జనను ఎలా నిర్వహించారని, ఆ కార్యక్రమానికి పోలీసులు ఎలా అనుమతి ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. 30 యాక్ట్ ఒక్క జనసేన కార్యక్రమాలకు మాత్రమే వర్తిస్తుందా? అని కూడా ఆయన ప్రశ్నించారు. పవన్ మరో రెండు రోజుల పాటు మంగళగిరిలోనే ఉంటారని, పోలీసులు పెట్టిన కేసుల్లో నుంచి పార్టీ కార్యకర్తలకు విముక్తి కల్పించాకే తిరిగి వెళతారని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News